రుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు

రుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు

మెదక్ జిల్లా: ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూరిటీ ఇస్తేనే లోన్ రెన్యువల్ చేస్తామని బ్యాంక్ అధికారులు షరతులు పెడుతున్నారు. థర్డ్ పార్టీ ష్యూరిటీ ఇవ్వకపోతే లోన్లు రెన్యువల్ చేయట్లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మెదక్ జిల్లాలోని రైతులు పంట సాగు పెట్టుబడి కోసం బ్యాంకుల్లో క్రాప్ లోన్ తీసుకున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని చెప్పడంతో చాలా మంది లోన్ లు తిరిగి చెల్లించలేదు. ప్రభుత్వం గతేడాది 25 వేల లోన్ ఉన్న రైతులకు, ఈఏడాది 50 వేల వరకూ రుణమాఫీ వర్తింపచేసింది. 50 వేల రూపాయల కంటే ఎక్కువ లోన్ బాకీ ఉన్న రైతులకు ఇంతవరకు రుణమాఫీ అమలు కాలేదు. బాకీలు సకాలంలో చెల్లించకపోవడంతో రైతులపై 12 శాతం వరకు వడ్డీ భారం పడుతోంది.  దాంతో వాళ్లు తీసుకున్నలోన్ వడ్డీ, దానిపై పెనాల్టీ ఇంట్రెస్ట్ కలిపి మూడు నాలుగింతలవుతోంది. మెదక్ జిల్లాలో చాలా బ్యాంకుల్లో రైతులది ఇదే పరిస్థితి. 

లక్షా 60వేలు పైబడి లోన్ ఉన్న రైతులందరికీ ఇదే పరిస్థితి

రుణమాఫీ అమలు కాకపోవడం, లోన్ రెన్యువల్ కోసం బ్యాంకులు కొత్త నిబంధన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షా 60 వేలకు పైగా లోన్ బాకీ ఉన్న రైతులు దాన్ని రెన్యువల్ చేసుకునేందుకు బ్యాంకులకు వెళితే థర్డ్ పార్టీ ష్యూరిటీ తేవాలని బ్యాంకర్లు చెబుతున్నారు. రైతులకు ష్యూరిటీ ఇచ్చేవారు 200 రూపాయల స్టాంప్  పేపర్లపై సంతకం చేయాలి. వేలిముద్ర వేసే వాళ్ల షూరిటీ పనికిరాదని... సంతకం పెట్టేవాళ్లే కావాలని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ష్యూరిటీ సైన్ చేసే వాళ్ళ ఆధార్ కార్డు, ఫోటోని బ్యాంక్ సిబ్బంది తీసుకుంటున్నారు. ఒకవేళ సకాలంలో  ఆ రైతు బాకీ చెల్లించకుంటే... ష్యూరిటీ ఇచ్చిన వాళ్ల నుంచి వసూలు చేస్తామని చెబుతున్నారు. ఈ రూల్స్ వల్ల  రైతులకు ష్యూరిటీ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో రుణ బాకీలు ఉన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

లోన్ తప్పనిసరి రెన్యువల్ చేసుకోవాలని బ్యాంకర్ల ఒత్తిడి

లోన్ తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుండటంతో ష్యూరిటీ ఇచ్చేవాళ్ళ కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని ఏపీ జీవీబీ తోపాటు శివ్వంపేట మండలంలోని అనేక బ్యాంకుల్లో ష్యూరిటీలు అడుగుతుండటంతో రైతులు లోన్ రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. జిల్లాలోని ఇతర మండలాల్లోని బ్యాంక్స్ లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం రుణమాఫీ చేసి ఉంటే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని రైతులు వాపోతున్నారు. రైతుకు భూమి ఎంత ఉన్నాసరే... లోన్ అమౌంట్ లక్షా 60 వేలు దాటితే ష్యూరిటీ తప్పనిసరిగా తీసుకోవాలని పైఅధికారుల నుంచి తమకు గైడ్ లైన్స్ ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారు.