
న్యూఢిల్లీ: పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజు భారీగా పెంచే ప్రతిపాదనను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. కొన్ని వారాల క్రితం రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఛార్జీలను కూడా పెంచిన విషయం తెలిసిందే. 20 ఏళ్లు పైబడిన ప్రైవేట్ కార్లపై ఫిట్‌నెస్ టెస్ట్‌కు రూ.2 వేలు వసూలు చేయనున్నారు. అదే 15 ఏళ్లు పైబడిన ట్రక్కులు, బస్సుల (మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్స్) పై రూ.25 వేలు ఛార్జీ పడనుంది. పాత వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫిట్‌నెస్ టెస్ట్ ఛార్జీలను గవర్నమెంట్ పెంచుతోంది.
కొత్త, సురక్షితమైన, తక్కువ కాలుష్యం కలిగించే వాహనాల వైపు ప్రజలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేట్ వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఆర్‌టీఓలు ప్రైవేట్ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లను బండిని చూసి ఇస్తున్నాయి. ప్రభుత్వం త్వరలో ఆటోమేటెడ్ టెక్నికల్ టెస్ట్‌లను దశలవారీగా ప్రవేశపెట్టాలని చూస్తోంది. వాణిజ్య వాహనాల కోసం కొత్త ఫీజు స్లాబ్‌లు తీసుకురానుంది. 10, 13, 15, 20 ఏళ్ల వయస్సు ఆధారంగా వేర్వేరు ఫీజులు వర్తిస్తాయి. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలపై ఒకే ఫీజు వర్తిస్తోంది.