దేవుడా ఏంటిది : కరోనా కొత్త వైరస్.. అమెరికాకూ పాకింది

దేవుడా ఏంటిది : కరోనా కొత్త వైరస్.. అమెరికాకూ పాకింది

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే EG 5 వేరియంట్‌ అనే కొత్త వైరస్ దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్‌ ఒమిక్రాన్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2‌ స్ట్రెయిన్‌తో పోలిస్తే EG.5లోని స్పైక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు (మ్యూటేషన్) అదనంగా ఉందని గుర్తించినట్లు చెప్పారు. ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని వారు వెల్లడించారు.

EG 5తో పాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ కొత్త వైరస్ ఎరిస్ లేదా EG.5.1 ప్రస్తుతం యూకేలో వేగంగా విస్తరిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాదు బ్రిటన్‌ ను భయపెట్టిస్తున్న కొత్త వేరియంట్‌ ఇప్పుడు భారత్‌ తో పాటు  ఐర్లాండ్, ఫ్రాన్స్,  జపాన్, చైనాలలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ వైరస్ కు సంబంధించిన కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్వో తెలిపింది. కాగా ప్రస్తుతం ఎరిస్ కేసులు మహారాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది.