తిరుపతిలో కరోనా‌ కలకలం... - నలుగురికి పాజిటివ్ నిర్దారణ... అప్రమత్తమైన అధికారులు

తిరుపతిలో కరోనా‌ కలకలం... - నలుగురికి పాజిటివ్ నిర్దారణ... అప్రమత్తమైన అధికారులు

తిరుపతి (Tirupati) నగరంలో 4 కరోనా కేసులు (Corona Cases) నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. రుయాస్పత్రిలో చేసిన కొవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన నలుగురికి అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.కరోనా సోకిన వారిలో అనంతపురానికి (Ananthapuram) చెందిన ఓ వ్యక్తి, బెంగుళూరుకు (Bengaluru) చెందిన ఓ మహిళ, తిరుపతికి చెందిన దంపతులు ఉన్నారు. అనంత, బెంగుళూరు నుంచి వచ్చిన రోగులను ఐడీహెచ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, నగరానికి చెందిన దంపతులను ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

రుయా ఆస్పత్రి  డీఎంహెచ్‌వో శ్రీహరి ... సూపరింటెండెంట్‌ రవిప్రభుతో కలిసి ఆస్పత్రిలోని కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని, ఐసోలేషన్‌ కేంద్రాన్ని, ఆక్సిజన్‌ పడకలను పరిశీలించారు. ర్యాపిడ్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన వారిని కేవలం కొవిడ్‌ అనుమానితులుగానే పరిగణిస్తామని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వస్తేనే పాజిటివ్‌గా నిర్థారణ చేస్తామని తెలిపారు. అయితే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలో రోజుకు 100మందికి పైగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. వీలైనంత వరకు అందరూ మాస్కు ధరించడం, శానిటైజర్లు వాడడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం సురక్షితమన్నారు. ఆర్‌ఎంవో రవికుమార్‌, ఏఆర్‌ఎంవో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భయపడాల్సిన అవసరం లేదు : డీఎంహెచ్‌వో

తిరుపతి రుయా ఆస్పత్రికి రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న వార్డుల వద్దకు బయటి వారిని పంపకుండా జాగ్రత్త వహిస్తున్నారు. చలి కాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని పేర్కొంటున్నారు. మరోవైపు, మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

తిరుమల వెంకటేశుని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తుంటారు. ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో తిరుపతిలో కరోనా కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్క్ ధరించేలా, జాగ్రత్తలు పాటించేలా టీటీడీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కరోనా పరీక్షలు నిర్వహించేలా చూడాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.