జీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఆఫీసర్లపై వేటు!

జీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఆఫీసర్లపై వేటు!
  •     రిజైన్ చేసి వెళ్లాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు
  •     46 మంది రిటైర్డ్ అయినట్లు సర్కార్ కు రిపోర్టు 
  •     త్వరలో వీరి పోస్టులన్నీ ఖాళీ అయ్యే చాన్స్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఆఫీసర్లపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టి వేటు వేస్తున్నది. ఐదారేండ్ల కిందట రిటైర్ మెంట్ అయినా కూడా.. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇంకా కొనసాగుతున్నారు. వీరిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వం బల్దియా ప్రక్షాళన మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రిటైర్డ్ అయి లాంగ్ స్టాండింగ్ లో అక్కడే తిష్టవేసిన వారి డీటెయిల్స్ కోరింది.

మొత్తం 46 మంది రిటైర్డ్ ఆఫీసర్లు పని చేస్తున్నట్లు సర్కార్ కు కమిషనర్ రిపోర్టు పంపారు. అందులో ఇప్పటికే రిటైర్డ్ అయి ఇంకా ఉన్న హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ సురేశ్, ఫైనాన్స్ విభాగ అడిషనల్ కమిషనర్ జయరాజ్​కెనెడీ తో పాటు తదితరులు ఉన్నారు. అయితే ఉన్నతాధికారి ఆదేశాలతో సురేశ్ ఇప్పటికే రిజైన్ చేసి వెళ్లారు. కెనెడి కూడా రేపో మాపో  రిజైన్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే కంట్రోల్ రూమ్ ఓఎస్​డీ అనురాధ కూడా రిటైర్ మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు. ఇలా వీరితో పాటు మిగతా అధికారులు కూడా వారే వెళ్లేలా చేస్తున్నారు. లేకపోతే ప్రక్షాళనలో భాగంగా అందరిని ఒకేసారి తొలగించనున్నట్లు తెలిసింది. వీరిస్థానంలో ఇతరులను నియమించనున్నారు. 

 ఏండ్లుగా ఇదే పరిస్థితి..

ప్రస్తుతం బల్దియా అధికారుల్లో దాదాపు సగానికిపైగా మంది ఐదారేండ్లకు మించి పనిచేస్తున్న వారే ఉన్నారు. మొన్నటి వరకు అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సహా పలువురు అధికారులు ఏండ్లకు ఏండ్లు ఇక్కడే తిష్టవేశారు. ఎన్నికల కోడ్ లో వచ్చినప్పుడు మాత్రమే బల్దియా పరిధిలోనే అటు ఇటు బదిలీలు చేస్తున్నారే తప్ప వేరే ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేయడంలేదు. మళ్లీ ఎన్నికలు అయిపోయాక తిరిగి ఎవరి పోస్ట్ లోకి వారు వస్తున్నారు.  

కొన్ని కీలక పదవుల్లో మాత్రం రిటైర్ అయిన తర్వాత కూడా వారినే తిరిగి కొనసాగుతున్నారు. వీరు బల్దియాను వీడకపోతుండటంతో కిందిస్థాయిలో ఉన్నవారు అవకాశాలను కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అంతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషనర్ ప్రాసెస్ మొదలుపెట్టారు. కొద్దిరోజుల్లో రిటైర్డ్ అధికారులంతా వెళ్లనున్నారు.    

అధికారుల్లో  టెన్షన్..

గత ప్రభుత్వ హయాంలో పాలకులను మెప్పించడం కోసమే అన్నట్లుగా బల్దియాలో కొందరు అధికారులు పని చేశారు. కేవలం సంబంధిత మంత్రితో మాత్రమే అవసరం అన్నట్లుగా వ్యవహరించినవారు చాలా మంది ఉన్నారు. కనీసం ప్రజలకు అందుబాటులో కూడా ఉండని ఆఫీసర్లు సైతం ఇంకా ఉన్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొద్దామని ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయడంలేదు.  

కొత్త ప్రభుత్వం వచ్చాక పాలనలో వర్కింగ్ స్టైల్ మారింది. దీంతో ఆఫీసర్లలో టెన్షన్  నెలకొంది. ఏండ్లకు ఏండ్లుగా బల్దియాలో పనిచేస్తుండటంతో ఎప్పుడు తమ బదిలీ ఉంటుందోననే డైలమాలో పడ్డారు. ప్రస్తుతం ముగ్గురు, నలుగురు అధికారులు కలిస్తే చాలు ఏం జరుగుతుందోననే చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో సీఎంగా ఒకరు ఉండగా, మున్సిపల్ మంత్రిగా మరొకరు ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ నిర్ణయం వస్తుందోననే టెన్షన్ లో బల్దియా అధికారులు ఉన్నారు.