తెలంగాణలో కొత్త సర్కార్ ​తక్షణం చేయాల్సిన రిపేర్లు ఇవే

తెలంగాణలో కొత్త సర్కార్ ​తక్షణం చేయాల్సిన రిపేర్లు ఇవే
  • అందెశ్రీ కవిత్వంతో అసెంబ్లీలో మొదటి  ప్రసంగం చేసిన సీఎం రేవంత్​రెడ్డి 

కేసీఆర్​ను ఆయన కుటుంబాన్ని గట్టిగానే విమర్శిస్తూ ఎదుర్కొన్నాడు. ‘రాజకీయాల్లో శత్రువులెవరూ ఉండరు. అంతా ప్రత్యర్థులే’ అన్న సూత్రం సీఎం ప్రతిమాటలో కనిపించింది. సీఎం రేవంత్​రెడ్డి కిందిస్థాయి నుంచి ఎన్నో డక్కామొక్కీలు తిని వచ్చిన నేత కాబట్టి ఏమాత్రం కూడా రాజీ ధోరణి కనిపించలేదు.  రాబోయే అయిదు ఏండ్లలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. దానికి కాలమే సమాధానం చెప్పాలి.

నాయకుడు శత్రువులపై వ్యూహం–ప్రతివ్యూహం చేస్తే జనం సంతోషిస్తారు. అది అతడి క్యాలిబర్​గా భావిస్తారు. కానీ, అది సొంత మనుషులపై అణచివేతలా ప్రతిబింబించకూడదు. ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకులను ఇక్కడి ప్రజలు శత్రువులుగా భావించారు. కాబట్టి కేసీఆర్​ ఏం చెప్పినా జనం గొప్పగా భావించారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన ‘అభద్రతతో కూడిన అణచివేత’పై ప్రజల్లో అసహనం మొదలైంది. 

దీని పర్యవసానమే ఇటీవల ఎన్నికల ఫలితాలు. ఇప్పుడు డైనమిక్​గా ఉన్న సీఎం రేవంత్ ​రెడ్డి సొంత తెలివితేటలుగల స్వయం ప్రకాశిత స్వభావి. అయితే కార్పొరేట్ గణాంకాల్లా నాయకులను తప్పుదోవ పట్టించే మన ‘బ్యూరోక్రసీ’ ఎందరినో అధికార పీఠం నుంచి దించేసింది. నాయకులకు ఉండే ఒత్తిళ్లు రాజకీయాల వైపే చూడనిస్తాయి. దీంతో పాలనపై ఎక్కువగా సలహాదారులపైనే ఆధారపడతారు. అక్కడే నాయకులు తమ విచక్షణ కోల్పోతే తాము పతనం అయ్యేవరకూ వారికే తెలియదు.

మేధోమథనం కంటే జనం నాడి గొప్ప

 మేధోమథనం కంటే జనం నాడి గొప్పది.  మేధోమథనం వ్యవస్థల నిర్మాణానికి పనికివస్తుందే కానీ రాజకీయ లక్ష్యం నెరవేర్చదు. ఈ సున్నితమైన పొరను నాయకులు గ్రహిస్తే తిరుగుండదు. కేసీఆర్​ దెబ్బతిన్నదీ, రేవంత్​ గమనించాల్సిందీ అదే. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నాయకుల అహంకార ధోరణిని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దుబారా ఖర్చు ఎక్కువైందని, నాయకులకూ, ప్రజలకూ మధ్య ఇనుపగోడ ఏర్పడిందనీ వాళ్లు ఓడిపోయేవరకూ వాళ్లకే తెలిసిరాలేదు. పథకాలు ఎక్కువైతే ఎగువ మధ్యతరగతి సహించలేకపోతుంది. 

రైతు బంధు అందరూ మెచ్చిందే. అయితే దానికి సీలింగ్ లేకపోవడం అది తీసుకున్నవాళ్లకు కూడా నచ్చలేదు. అలాగే కుల భవనాలు అడిగినవారికి ఇవ్వొచ్చు.  అలాకాకుండా అదో ఉద్యమంగా చేయడం సరికాదు. ఆ భవనాల వల్ల సామాన్యులకు ఏం ఒరిగేది లేదు. ఇప్పుడు సీఎం దీనిపై సమీక్ష చేసి వాటిని ఆయా కులాల విద్యార్థులకు హాస్టల్స్​గా, సివిల్స్​లాంటి ఉన్నత పరీక్షల వనరుల కేంద్రాలుగా మార్చాలి. 

అశాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు

 అశాస్త్రీయంగా విభజన చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్​రెడ్డి తక్షణం సమీక్షించాలి. కొందరు నాయకులు పనిగట్టుకొని తమ భూముల రేట్ల కోసం అవసరంలేని కొత్త జిల్లాల ఏర్పాటుకు వంత పాడారు. అలాగే కేసీఆర్ కూడా పాత జిల్లాల్లో నాయకుల విస్తృత ప్రాబల్యం తగ్గించేందుకు సామంత రాజ్యాలుగా మార్చాడు. పాత పది జిల్లాలను ఇరవై జిల్లాలుగా మారిస్తే సరిపోతుందని విస్తృత జనాభిప్రాయం ఉంది. ఇష్టారీతిన 33 జిల్లాలుగా మార్చడం వల్లనే 317 జీవోలాంటి పాషాణం ఉద్యోగస్థుల గొంతులో పడి గత ప్రభుత్వం అపఖ్యాతి మూటగట్టుకొంది. పాత రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలు చేశారు. శంకర్​పల్లి నుంచి సంగారెడ్డిగానీ, వికారాబాద్​గానీ 15 నిమిషాల్లో వెళ్లొచ్చు. 

ఆ మండలాల వారు కొంగర్​ కలాన్​ కలెక్టరేట్​కు ఎలా వెళ్లాలి?. అలాగే ఉమ్మడిగా ఉన్నప్పుడు గొప్పగా ఉన్న రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్​ జిల్లాను రూరల్​గా మార్చడం వల్ల తలసరి ఆదాయం 150 రూపాయలుగా అతి తక్కువగా ఉంది. అలాగే డీఎస్సీలో 200 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి లేదు. జిల్లాకు ఏ ఆదాయమూ లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఒక్క మాట మాట్లాడని ఆ జిల్లా నలుగురు ఎమ్మెల్యేలు పరాజయం పాలయ్యారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. కాబట్టి సీఎం రేవంత్ ఇలాంటి దుబారా వ్యవహారంపై తక్షణం దృష్టి సారించాలి. 

ప్రభుత్వ విద్యను గాడిన పెట్టండి

దళితబంధులాంటి ఫెయిల్యూర్, అపఖ్యాతిమూటగట్టుకొనే  స్కీముల స్థానంలో దళితులకు విద్య, స్వయం సమృద్ధిపై దీర్ఘకాలిక ఆలోచన చేయాలి. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్​ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్​ చెప్పింది. దానికోసం మండలంలోని ‘పాఠశాల సముదాయం’ పేరుతో స్థాయి పెంచాలి. వసతుల కల్పన సరిగ్గా చేస్తే ప్రతి పాఠశాల ఒక అంతర్జాతీయ పాఠశాలగా మార్చవచ్చు. 

ఉదాహరణకు ఒక హైస్కూల్​లో 8 నుంచి 20మంది టీచర్లు, సిబ్బంది పనిచేస్తే వాళ్లకు10 లక్షల జీతం ఇచ్చే ప్రభుత్వం నెలకు పదివేలు చెల్లించి బాత్రూమ్​ల నిర్వహణకు మనిషిని పెట్టలేకపోతున్నది. లేదంటే విద్యార్థులే తమ బాత్రూమ్​లను నిర్వహించేలా సేవా దృక్పథాన్ని గాంధీ మార్గంలో ఉద్యమ రూపంలో చేయాలి. లక్షలు వెచ్చించి కంప్యూటర్లు ఇచ్చే ప్రభుత్వం దాన్ని నేర్పించే నిపుణుడిని పెట్టదు. కోట్లు వెచ్చించి భవనాలు నిర్మిస్తూ తోటమాలి, వాచ్​మెన్​లకు అయ్యే పదిహేను వేలకు వెనక్కి తగ్గడం వల్ల పాఠశాలలు, కళాశాలల స్థాయి పడిపోతున్నది. ఎవరో ఒక్క టీచర్​ పనిచేయకపోతే  జెండాకు ఎక్కించే మన వ్యవస్థలు, ప్రభుత్వం..తమ సొంతఖర్చు పెట్టే బోధకులను ప్రశంసించడం మానేసింది. 

సమాజాభివృద్ధి అంటే ఆర్థికకోణం కాదు

ఇటీవల దెబ్బతిన్న గ్రామీణ ప్రాంత సామరస్యాన్ని పున:నిర్మాణం చేయాలి. పరస్పర సహకారం స్థానంలో కక్షలు, కులాలు, పార్టీలు, అరాచకం ఎక్కువ అవుతున్నందున ప్రజలకు ‘నైతిక జీవనం’ కల్పించాలి. తద్వారా సమాజం శాంతియుతంగా ఉంటే ప్రభుత్వానికి పెద్ద ఒత్తిడి తప్పుతుంది. ఈ నైతికవర్తన లేకుండా డబ్బు, వసతులు, రాజకీయం మాత్రమే నేర్పిస్తే  అరాచకం పెరిగిపోతుంది.దానివల్లనే మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి.  

ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కన్నా మద్యపానంలో తెలంగాణ టాప్​లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.  ఆదాయం రావొచ్చుగానీ ఆదర్శం విధ్వంసం అవుతున్నది. తాగుబోతుల డబ్బుతో అభివృద్ధి సరైన కొలమానం కాదు. అణగారిన కులాలను మద్యం విధ్వంసం చేస్తున్నది. సీఎం రేవంత్​రెడ్డి గత ప్రభుత్వం చేసిన ఈ తప్పును కొనసాగించకూడదు. 

పోలీసు వ్యవస్థను, ఉచిత కరెంటు విధానాన్ని సరిదిద్దాలి

బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ఇష్టారీతిన వాడింది. ఆఖరకు అన్నదమ్ములు, భార్యాభర్తల పంచాయితీల్లో కూడా స్థానిక నాయకులు పోలీస్ వ్యవస్థను ప్రభావితం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్​ అని నేరగాళ్లకు సహకరించేవిధంగా మారొద్దు. దోషికి శిక్షపడితే వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. ఆదర్శ సమాజాల్లో, తక్కువ జన సాంద్రత ఉన్నచోట అమలు చేయాల్సిన నిర్ణయాలు మనలాంటి బహుళ సమాజానికి అనుగుణంగా మార్చుకోవాలి. అంతేగానీ ‘పిచ్చి సిద్ధాంతాలు’ అమలుచేయడం వల్ల జరిగే ప్రహసనం చాలా దేశాల్లో చూస్తున్నాం. 

పార్టీలతో, రైతులతో చర్చించి 24 గంటల కరెంటు దుబారాను అరికట్టడం వల్ల భూగర్భ జలాలను రక్షించుకోగలుగుతాం. ఇదొక రాజకీయ చర్చగా మార్చొద్దు. మధ్యతరగతిని భయపెడుతున్న కరెంటు బిల్లులకు ఉపశమనం కలిగించాలి. ఆర్ఎంపీలకు సరైన శిక్షణను ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక చికిత్సకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. 

అప్పుచేసి పప్పుకూడు తగదు

ఏ ప్రభుత్వమైనా సంపద సృష్టికి  అప్పులు చేస్తే దాన్ని వృద్ధికి సంకేతంగా గణిస్తాం. కానీ, అప్పుచేసి పప్పు కూడు మంచిది కాదు. బోలెడన్ని స్కీములు పెట్టినా అవి రాజకీయ దృక్కోణంలో ఉండడం వల్ల మిగతా సమాజంలో అన్​రెస్ట్ పెరిగిపోయింది. ప్రస్తుతం రేవంత్​రెడ్డి  ఓ వైపు సమ్మిళిత వృద్ధి, మరోవైపు రాజకీయం రెండూ సమానంగా చేయాలి. 

ముఖ్యంగా పేదవారిని అప్పులపాల్జేస్తున్న విద్య, వైద్యంపై నిజాయతీతో కూడిన టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేయాలి. విద్య, వైద్యం విషయంలో జరుగుతున్న కార్పొరేట్​ దోపిడీని అరికట్టే సమాంతర వ్యవస్థను సృష్టించాలి. భూసమస్యల్లో ఆశ్రిత పక్షపాతం లేకుండా పనిచేసే విధంగా మోరల్ మానిటరింగ్ ఉండాలి. కోటి ఆశలతో కొలువుదీరిన ప్రభుత్వం ఇది. సంప్రదాయకంగా కాంగ్రెస్​ అలవాటును మార్చేవిధంగా కాకుండా ‘ఆపద మొక్కులు, సంపద మరుపులు’ అన్న మార్గంలో నడిస్తే మళ్లీ చరిత్రనే పునరావృతం అవుతుంది.

- డా. పి. భాస్కరయోగి,
పొలిటికల్​, సోషల్​ ఎనలిస్ట్