జీ-మెయిల్స్‌ తో వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్న హ్యాకర్లు

జీ-మెయిల్స్‌ తో వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్న హ్యాకర్లు

ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న ఆన్‌ లైన్ అవసరానికీ ఈ-మెయిల్ అవసరం అయిపోయింది. ఈ క్రమంలో ఈ  జీ-మెయిల్స్‌ ను ఆసరాగా చేసుకుంటున్న హ్యాకర్లు.. మన వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి కొత్త కొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నారు. లేటెస్టుగా ఇలాంటి ఒక పద్ధతిని గుర్తించినట్లు క్యాస్పర్‌స్కై అనే సెక్యూరిటీ సంస్థ తెలిపింది. సైబర్ నేరగాళ్లు అమెజాన్, పేపాల్ వంటి ప్రముఖ కంపెనీల పేరిట మెయిల్స్ పంపుతున్నట్లు ఈ కంపెనీ గుర్తించింది. యూజర్ల ఖాతాల నుంచి ఖరీదైన వస్తువులకు చెల్లింపులు జరిగినట్లు ఈ మెయిల్స్ వస్తాయట. తమ అమెజాన్ ఖాతాలో యాపిల్ వాచ్, గేమింగ్ ల్యాప్‌టాప్ వంటి ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేశారని, వీటికి పేపాల్ నుంచి చెల్లింపులు జరిగాయని ఈ మెయిల్ చెబుతుంది.

ఒకవేళ ఈ చెల్లింపులు ఆ వ్యక్తి చేయకుంటే వెంటనే కింద ఇచ్చిన మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలని మెయిల్ వస్తుంది. ఇలాంటివి చదివిన యూజర్లు ఏం చేయాలో తెలియక వెంటనే ఆ నంబరుకు ఫోన్ చేస్తారు. దీనికి బదులిచ్చే హ్యాకర్లు అమెజాన్ లేదంటే పేపాల్ ప్రతినిధిలా మాట్లాడతారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా చోరీ చేస్తున్నారు. ఒక్కోసారి ఫోన్ మాట్లాడే సమయంలో యూజర్‌ను తప్పుదారి పట్టించి వారి కంప్యూటర్లలో వైరస్‌ ఇన్‌స్టాల్ చేసుకునేలా సూచనలిస్తున్నారు. ఇలా చేసి కంప్యూటర్లలోని డేటా మొత్తాన్ని కాజేస్తున్నారట. 

ఇటువంటి మెయిల్స్ వస్తే వెంటనే ఓపెన్ చేయకుండా ఇలాంటి లావాదేవీలు తమ ఖాతా నుంచి జరిగాయా? లేదా? అని నిర్ధారించుకోవాలని సూచించింది క్యాస్పర్‌స్కై సంస్థ. అనుమానం వస్తే ఈ మెయిల్స్‌ను డిలీట్ చేసేయాలంటున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.