మహిళలకు స్త్రీనిధి సురక్ష

మహిళలకు స్త్రీనిధి సురక్ష
  • ‘సురక్ష బి’ పేరుతో ఇన్సూరెన్స్‌‌ స్కీం ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  • ఏడాదికి రూ.230ల చొప్పున మూడేళ్లకు రూ.690 ప్రీమియం
  • మెంబర్‌‌ చనిపోతే రూ. లక్ష బీమా
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 61,608 మంది సభ్యులకు వర్తింపు

నల్గొండ, వెలుగు : మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి స్కీం కింద కొత్తగా ‘సురక్ష బి’ అనే పేరుతో ఇన్సూరెన్స్‌‌ స్కీం ప్రవేశపెట్టారు. మూడేళ్ల కాలపరిమితితో మహిళా సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 71 మండలాల్లో మొత్తం 2,294 వీవోలు ఉన్నాయి. వీటి పరిధిలో 61,608 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సభ్యులందరికీ స్త్రీనిధి సురక్ష బి స్కీం వర్తిస్తుంది. ఇందులో భాగంగా ప్రతి సభ్యురాలు ఏడాదికి రూ.230 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీం కాలపరిమితి మూడేళ్ల వరకు ఉంటుంది. అయితే మూడేళ్ల ప్రీమియం రూ. 690 ఒకేసారి కూడా చెల్లించొచ్చు.
గ్రూపుగాను లేదంటే.. ఒక్కరైనా చేరొచ్చు
సంఘంలోని సభ్యులందరూ లేదా ఒక్కరైనా ఇన్సూరెన్స్‌‌ గ్రూప్‌‌లో చేరే చాన్స్‌‌ ఉంది. సంఘంలో పది మంది మెంబర్స్‌‌ ఉంటే వారికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని స్త్రీనిధి నుంచి లోన్‌‌ తీసుకొని చెల్లించుకోవచ్చు. సంఘంలో సభ్యురాలు అనారోగ్యంతో చనిపోయినా  లేదా ఏదైనా కారణం చేత మరణించినా రూ. లక్ష బీమా చెల్లిస్తారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ స్కీంను ప్రవేశపెట్టినట్లు ఆఫీసర్లు చెప్పారు. 
జిల్లాలో ఏటా రూ.200 కోట్ల లోన్లు
స్త్రీ నిధి కింద నల్గొండ జిల్లాలో ప్రతి ఏటా రూ. 200 కోట్ల వరకు లోన్లు ఇస్తున్నారు. గతేడాది సుమారు 50 వేల మంది సభ్యులకు రూ.175 కోట్ల లోన్లు ఇచ్చారు. ఈ ఏడాది దానిని రూ.193 కోట్లకు పెంచారు. దీంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లోన్లు కూడా మంజూరు చేస్తున్నారు. పాడిసంపదను పెంచేందుకు గేదెలు, ఆవులు ఇస్తున్నారు. గతేడాది జిల్లాలో సుమారు మూడు వేల పశువులను పంపిణీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో మహిళల సంక్షేమం దృష్ట్యా సురక్ష బి అనే ఇన్సూరెన్స్‌‌ స్కీంను సైతం ప్రవేశపెట్టారు. ఇప్పటికే సురక్ష పేరుతో లోన్‌‌ లింక్డ్‌‌ ఇన్సూరెన్స్‌‌ స్కీం అమలు అవుతోంది. ఇందులో సభ్యులుగా ఉన్న వారు సైతం కొత్త స్కీంలో మెంబర్‌‌గా చేరొచ్చు.
మహిళలు వినియోగించుకోవాలి 
స్త్రీనిధి ‘సురక్ష బి’  స్కీంను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి. పేద, నిరుపేద సభ్యులకు ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. లోన్‌‌ తీసుకొని కూడా ప్రీమియం కట్టొచ్చు. సెర్ప్‌‌ సిబ్బంది, స్త్రీనిధి స్టాఫ్​ గ్రామ, మండల స్థాయిలో ఈ స్కీం గురించి అవగాహన కల్పించాలి. సంఘంలోని ప్రతి ఒక్క సభ్యురాలు ప్రీమియంలో చేరేలా చర్యలు తీసుకోవాలి.                             -  కాళిందిని, డీఆర్డీవో, నల్గొండ