నవ భారతానికి నూతన చట్టాలు

నవ భారతానికి నూతన  చట్టాలు

బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ఏండ్ల తరబడి అమలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. లోక్‌‌‌‌సభలో ఇటీవల 3 నూతన చట్టాల బిల్లులు ప్రవేశపెట్టింది. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న అనేక చట్టాలను ముఖ్యంగా మూడు కీలక చట్టాలను రద్దు చేసే దిశగా పార్లమెంట్‌‌‌‌లో బిల్లును ప్రవేశ పెట్టింది. ఇందులో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)-1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌‌‌‌పీసీ)-1898 లను రద్దు చేయనున్నట్లుగా కేంద్ర హోమ్ మంత్రి పార్లమెంట్‌‌‌‌లో ప్రకటించారు. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో “భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023” ను,  ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో “భారతీయ సాక్ష్యాల చట్టం 2023” ను, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో “భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023” అనే పేర్లతో కొత్త చట్టాలను తీసుకురావడానికి ఈ బిల్లు ప్రతిపాదించారు. దేశంలోని అసాంఘిక, తీవ్ర వాద, వేర్పాటువాద శక్తులను, హత్యలు, స్త్రీలపై, బాలికలపై అత్యాచారాలు, కిడ్నాప్ లు వంటి అనేక నేరాలకు కఠినమైన శిక్షలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లులో సుమారుగా 313 సవరణలు చేసినట్లుగా పేర్కొన్నారు. 

దేశంలోని నేర చట్టాలను సంస్కరించడానికి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ 2020  మే 4న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నేర చట్టాల మీద అవగాహన ఉన్న నిపుణుల కమిటీని నియమించింది. భారత సమాజంలోని అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సమర్థవంతమైన నేర నియంత్రణ చట్టాల సంస్కరణల సిఫార్సు కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల కమిటీని ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన మాజీ వైస్ ఛాన్స్​లర్ ప్రొఫెసర్ రణబీర్‌‌‌‌సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది.  కమిటీలో సభ్యులుగా జీస్ బాజ్ పాయ(ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ రిజిస్టర్), బాల్ రాజ్ చౌహాన్(మొదటి వైస్ ఛాన్సలర్ ఎన్​ఎల్​యూ జబల్ పూర్), మహేశ్ జెఠ్మలానీ(సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది), జీపీ తరెజు డోర్మర్(జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి న్యూ ఢిల్లీ)లను నియమించింది. ఈ కమిటీ 2020 జులైలో ఒక ప్రశ్నాపత్రం ద్వారా ప్రజలు, న్యాయ కోవిదులు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ తర్వాత , 2022 ఫిబ్రవరి 27న క్రిమినల్ చట్టాలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ చట్టంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఎన్నో రోజులుగా విమర్శకుగురవుతున్న బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడం. 

రాజద్రోహ చట్టం రద్దు 

రాజద్రోహ చట్టం124 ఏ ప్రకారం అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఎందరినో బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. బ్రిటీష్ అవశేష చట్టమైన రాజద్రోహాన్ని స్వాతంత్ర్యం తర్వాత కూడా భారత ప్రభుత్వాలు కొనసాగించాయి. ప్రజల స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా ఈ చట్టం రద్దు చేయాలని చాలా కాలంగా డిమాండ్​ఉంది. ఈ చట్టం పాలకుల వ్యతిరేకులను అణచడానికి ఉపయోగించే ఒక ఆయుధంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాజద్రోహ/దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ రాజద్రోహ చట్టం పూర్తిగా రద్దు చేయడంతో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కును కల్పించినట్లయింది. రాజద్రోహ చట్టం కింద మాటల ద్వారా, సంకేతాల ద్వారా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించిన వారికి జీవితకాలం పాటు శిక్ష, జరిమానా లేదా మూడేండ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేవారు. దేశద్రోహ చట్టం రద్దు చేస్తూ భారతీయ న్యాయ సంహితం బిల్లులో  సెక్షన్ 150 లో కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త చట్టంలో రాజద్రోహం నిబంధనలు ఏమీ ఉండవు. రాజద్రోహానికి సంబంధించిన కేసులు నమోదు మాత్రమే వీలుంటుంది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రత, ఐక్యతకు భంగం కలిగించే  విధంగా దేశ విభజన వాద, దేశ వేర్పాటువాద, అశాంతి  కలిగిస్తే  కఠిన చర్యలు తీసుకోనున్నారు.  

మూడేళ్లలోపు న్యాయం

సాధారణంగా ప్రజలు కోర్టులంటే విముఖత చూపడానికి ప్రధాన కారణం.. కోర్టులో న్యాయం కోసం ఏండ్లపాటు తిరగాలనే భావన. బాధితుడికి సత్వర న్యాయం అందించడంలో ప్రస్తుత చట్టాలు కొంత మేరకు విఫలమయ్యాయనే భావన ప్రజల్లో ఉంది. సత్వరంగా న్యాయం కోసం ఏళ్ల తరబడి నడిచే విధానానికి స్వస్తి పలుకుతూ నూతన చట్టంలో పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా 90 రోజుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేసి అవసరమైన విచారణ జరిపి శిక్ష పడేలా కోర్టుల్లో సంబంధిత సాక్ష్యాలను పొందుపరచాలి. పోలీసులు180 రోజుల్లో కేసును దర్యాప్తు పూర్తి చేయాలి. అభియోగాలు ఖరారు చేసి కోర్టులో 60 రోజులకు మించి సమయం తీసుకోడానికి వీల్లేదు. వాదనలు పూర్తయిన తర్వాత 30 రోజుల్లోపల తీర్పు వెలువరించాలి. తీర్పు కాపీలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. దీంతో పాటు పోలీసులు ఎవరిని, ఎక్కడ అరెస్టు చేసినా, దానికి సంబంధించిన అరెస్ట్ సంబంధిత పత్రాలు జారీ చేయాలి. ఇందుకు ప్రతి పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఒక అధికారిని నియమిస్తారు. ప్రతి15 రోజులకు కేసుల స్థితిగతులను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ- ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో కేసు దర్యాప్తు, పురోగతిని తెలుసుకోవచ్చు. న్యాయ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదిత నూతన చట్టాలు దేశ నేర, న్యాయవ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి, స్వదేశీ నూతన చట్టాలు న్యాయ వ్యవస్థ తీరుతెన్నులను మెరుగుపరుస్తూ, ప్రజలకు సత్వర న్యాయంకు కృషి చేస్తాయని ఆశిద్దాం.

నూతన చట్టాలు, శిక్షలు

ఐపీసీలో మొత్తం 511 సెక్షన్లు ఉంటే నూతనంగా రూపొందించిన భారతీయ న్యాయ సంహిత- 2023 చట్టంలో వాటిని 356 సెక్షన్‌‌‌‌లకు కుదించారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 22 ప్రొవిజన్స్ ని రద్దు చేస్తూ, మరో 175 ప్రొవిజన్స్ కు సవరణ చేశారు. కొత్తగా ఎనిమిది సెక్షన్లను చేర్చి భారతీయ న్యాయ సంహిత-2023 చట్టాన్ని రూపొందించారు. సీఆర్​పీసీలో 478 సెక్షన్ లకు బదులు భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 533 సెక్షన్లు పెట్టారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో 167 సెక్షన్ లు  ఉండగా భారతీయ సాక్ష్యాల చట్టంను170 సెక్షన్లతో రూపొందించారు. ఇది వరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ లో హత్యా నేరం 302 కింద కేసు నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు అది భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్101 & 99 కింద నమోదు చేస్తారు. 

మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు

మహిళల గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే ఐపీసీ 354 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధనలు రూపొందించారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లో సెక్షన్ 73 కింద ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. హత్యాయత్నం కేసులో ఐపీసీ 307 కింద పదేళ్ల జైలు శిక్ష వేస్తుంటే బీఎన్ఎస్ సెక్షన్ 107 ప్రకారం జీవితఖైదు వేస్తారు. చట్టంలో ప్రధానంగా మహిళలపై జరిగే  అత్యాచార, కిడ్నాప్ మొదలగు నేరాలకు  కఠినమైన శిక్షలు విధించనున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 2021 ఏడాదిలో మొత్తం 31,677 రేప్ కేసులు నమోదు అయ్యాయి. అంటే సగటున రోజుకు 87 కేసులన్నట్లు. రాష్ట్రాల వారీగా రాజస్థాన్ 6,337 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, మధ్య ప్రదేశ్(2,947), ఉత్తర ప్రదేశ్​లు(2,845) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాటిని కట్టడి చేసేందుకే కేంద్రం కఠిన శిక్షలు ప్రతిపాదించింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ మూడు బిల్లుల్లో మూడు చట్టాలు కలిపి సుమారుగా 313 సవరణలు తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా నేర న్యాయ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులను సూచించారు. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఈ నూతన బిల్లులో అనేక నిబంధనలను పొందుపరచినట్లుగా బిల్లును ప్రతిపాదించిన కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో వివరించారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష సభ్యులు బార్ కౌన్సిల్, విశ్రాంత న్యాయమూర్తులు, లా కమిషన్ కూడా తగిన సలహాలను, సూచనలను, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నారు.


- డా. ఎ. కుమార స్వామి ఫ్యాకల్టీ, ఓయూ