- బీఆర్ఎస్లో నయా లీడర్లు
- ఎన్నికలు సమీపిస్తుండటంతో తెరపైకి ఆశావహులు
- హైకమాండ్ భరోసాతోనే రంగంలోకి.. టికెట్ ఖాయమని ప్రచారం
- ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజవర్గాల్లో కొత్త లీడర్ల హంగామా
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నయా లీడర్లు జోష్ మీదున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి కోత పెట్టక తప్పదని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయంగా స్పీడప్ అయ్యారు. హైకమాండ్ ఆదేశించి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అండగా నిలిస్తే ఎమ్మెల్యే బరిలో దిగుతామని చెబుతున్నారు. నల్గొండ, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, దేవరకొండ నియోజ కవర్గాల్లో నయా లీడర్ల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలతో అంటీముట్టనట్లుగా వ్యవహారిస్తున్న వీరంతా సొంత ఎజెండాతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ప్రధానంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి రాజకీయంగా దూకుడు పెంచారు. తాత గుత్తా వెంకట రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న అమిత్ ఇటీవల తండ్రితో కలిసి ప్రైవేటు కార్యక్రమాలకు అంటెడ్ అవుతున్నారు. ఇంకోవైపు గుత్తాతో సన్నిహితంగా మెలిగే ఎమ్మెల్యేల వెంట తిరుగుతున్నారు. ఆదివారం చౌటుప్పుల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ తన పోటీ గురించి మొదటిసారి నోరెత్తారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ, మనుగోడు స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నా నని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం, జిల్లా మంత్రి సహకరిస్తే రంగంలోకి దిగడం ఖాయమని స్పష్టం చేశారు.
మునుగోడు, నల్గొండలో పోటాపోటీ
గుత్తా కొడుకు కావడం అమిత్‌కు రాజకీయంగా కలిసొచ్చే అంశం. అయితే ఈ రెండు స్థానాలపైనే నమ్మకం పెట్టుకున్న ఆశావహులు చాలా మంది ఉన్నారు. వీళ్లలో ప్రధానంగా నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పైన పిల్లి రామరాజు యాదవ్ తిరుగుబాటు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నచ్చజెప్పినా వినకుండా సొంత ఎజెండాతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇక మునుగోడు సీటు కోసం బీసీ లీడర్లు ఎప్పటి నుంచో ఫైట్చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తప్పిస్తే నె క్ట్స్చాన్స్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. బీసీ ఓటర్లు బలంగా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, చౌటుప్పుల్మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మునుగోడు జడ్పీటీ సీ నారబోయిన రవి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేతో వీళ్లకున్న రాజకీయ విభేదాలు ఇటీవల కాలంలో మరింత ముదిరాయి.
తుంగతుర్తి పైన జ్యోతిపద్మ గురి..
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో తిరుగులేదని పార్టీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ ఇప్పుడు అదే స్థానం పైన ప్రభుత్వ మహిళా ఉద్యోగి జ్యోతి పద్మ ఫోకస్‌పెట్టారు. సూర్యాపేట జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా పనిచేస్తున్న జ్యోతిపద్మ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. 2004లో టీడీపీ నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆమె భర్త యాదగిరి గతంలో రాష్ట్ర కాం గ్రెస్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం జ్యోతి పద్మ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. ఉద్యోగుల కోటాలో ఎమ్మె ల్యే టికెట్ వస్తదని, కేసీఆర్ఆశీస్సులు తనకు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవై పు గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు కూడా పోటీలో ఉన్నానని చెబుతున్నారు. ఇటీవల సామేలు రైతు సమస్యల పైన నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు సెంటర్లు విజిట్ చేశారు.
కోదాడ, దేవరకొండలో దూకుడు...
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కన్మంత శశిధర్ రెడ్డి టికెట్ఆశిస్తున్నారు. 2018 ఎన్నికల్లో చివరి నిమిషంలో శశిధర్‌రెడ్డికి టికెట్ మిస్సైంది. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల మ ళ్లీ దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుతో కలిసి ఎమ్మెల్యే వైఖరి పైన బాహాటంగానే విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్తనకే వస్తదనే నమ్మకంతో కోదాడలో తన అనుచరవర్గంతో తరచూ భేటీ అవుతున్నారు. దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిలర్ వడ్త్యా దేవేందర్ ఎమ్మెల్యే టికెట్ఆశిస్తున్నారు. ఆయన తండ్రి శక్రు నాయక్ 20 04లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న దేవేందర్ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కౌన్సిలర్లతో కలిసి రాజకీయాలు నడిపారు. గుత్తా వెన్నంటే వస్తున్న దేవేందర్ ఎమ్మెల్యే టికెట్ కోసం పై స్థాయిలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల మార్పు అనివార్యమైతే తనకే టికెట్ వస్తదనే ధీమాతో ఉన్నారు.
