మలేరియాను నిర్మూలించడం ఇప్పట్లో అసాధ్యం

మలేరియాను నిర్మూలించడం ఇప్పట్లో అసాధ్యం

ఇప్పటివరకూ  మనుషులు పూర్తిగా నిర్మూలించిన ఒకే ఒక్క వ్యాధి మశూచి. పోలియోను 2000 సంవత్సరం నాటికే అంతం చేయాలని టార్గెట్​పెట్టుకున్నా చాలా దేశాలు ఫెయిల్​అయ్యాయి. మరి మహమ్మారి మలేరియా సంగతి ఏంటీ? నిర్ణయించుకున్న టార్గెట్​ ప్రకారం 2030 నాటికి దీనిపై పోరాటంలో అయినా సక్సెస్​ అవుతామా? అంటే.. ఇట్లయితే కష్టమే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). మలేరియా నిర్మూలనకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో లేవని, వాస్తవానికి రెండేళ్లుగా మలేరియాపై పోరాటం దాదాపుగా నిలిచిపోయిందని  ఆ సంస్థ వెల్లడించింది.  మలేరియా నిర్మూలన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయన్న వివరాలతో డబ్ల్యూహెచ్ఓ రూపొందించిన ఓ నివేదికను గురువారం జెనీవాలో  ఆ సంస్థ ‘గ్లోబల్​ మలేరియా ప్రోగ్రాం’  డైరెక్టర్ డాక్టర్​ పెడ్రో అలోన్సో  విడుదల చేశారు.

ఇదీ టార్గెట్

మలేరియా పోరాటం కోసం ‘గ్లోబల్​ టెక్నికల్ ​స్ట్రాటజీ ఫర్​ మలేరియా 2016–2030’ని డబ్ల్యూహెచ్ఓ 2015లో ఆమోదించింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి మలేరియా కేసులను, మరణాలను 40% తగ్గించాలి. కనీసం 10 దేశాల్లో మలేరియాను నిర్మూలించాలి. ఆ తర్వాత 2030 నాటికి మలేరియా కేసులను, మరణాలను 90% తగ్గించాలి. కనీసం 35 దేశాల్లో మలేరియాను పూర్తిగా అంతం చేయాలి. ఇప్పటికే మలేరియాను నిర్మూలించిన దేశాల్లో వ్యాధి తిరిగి ప్రబలకుండా అడ్డుకోవాలి.  దాదాపు 70 దేశాల నిపుణులు రెండేళ్లు కసరత్తు చేసి, మలేరియా స్ట్రాటజీని రచించారు. కానీ, ఈ టార్గెట్​చేరుకునే అవకాశాలు కనిపించడం లేదని డాక్టర్ పెడ్రో అలోన్సో స్పష్టం చేశారు. మలేరియా అంతానికి 1955 నుంచే ప్రయత్నాలు మొదలైనా, కొన్ని దశాబ్దాల పాటు పెద్దగా పురోగతి కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంపై బిల్​ అండ్​ మిలిండా గేట్స్​ఫౌండేషన్​ దృష్టి సారించిన తర్వాతే కొంత కదలిక వచ్చిందన్నారు. అనేక టీకాలు తయారు చేస్తున్నా, వందల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నా, కొన్నేళ్లుగా వివిధ వ్యాధుల నిర్మూలన ప్రయత్నాలు దాదాపుగా స్తంభించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పోరాటం ఆగింది

నిధులు, సరైన ప్రయత్నాలు లేక మలేరియా నిర్మూలన కార్యక్రమం దాదాపుగా నిలిచిపోయిందని డబ్ల్యూహెచ్ఓ  ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పోరాటంలో సక్సెస్​ కావాలంటే భారీగా డబ్బు  కావాలని, ప్రపంచ దేశాల నాయకులు మద్దతు ఇవ్వాలని కోరింది. గత దశాబ్దకాలంగా సాధించిన పురోగతి ఇప్పుడు రెండేళ్లుగా ఆగిపోయిందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో 2020, 2030 టార్గెట్లు చేరుకోవడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ టార్గెట్లు కొంతవరకైనా చేరాలంటే  ఇప్పటికిప్పుడు 34 బిలియన్ డాలర్లు కావాలని  తెలిపింది. కానీ 2010 నుంచి నిధులు ఆగిపోయాయని తెలిపింది. మలేరియా తీవ్రంగా ఉన్న 29 దేశాల్లో సరైన చర్యలు తీసుకుంటే 2030 నాటికి 200 కోట్ల కేసులను, 40 లక్షల మరణాలను నివారించవచ్చని వివరించింది.

టీకా ప్రభావం అంతంతే

ప్రస్తుతం మలేరియా వ్యాధి నివారణ కోసం డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన టీకా ఒక్కటే ఉంది. మాస్కిరిక్స్ (ఆర్ టీఎస్, ఎస్) అనే ఆ టీకాను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అయితే దాని శక్తి అంతంత మాత్రమేనని  నిపుణులు చెబుతున్నారు. 40 శాతం మాత్రమే పనిచేస్తోందంటున్నారు.  ఆఫ్రికా ​దేశాల్లోని పిల్లల్లో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటోందని తేలింది. మలేరియాను అంతం చేసేందుకు మరింత సమర్థమైన టీకాల అవసరం ఉందని, ఇతర అనేక నివారణ పద్ధతులూ రూపొందించాలని చెబుతున్నారు. అలాగే, వ్యాధి నివారణకు  నిరంతరం ప్రయత్నాలు జరగాలని, ఆ పరాన్నజీవి పునరుజ్జీవం చెందేందుకు సమయం ఇవ్వకూడదని సూచిస్తున్నారు.