కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త  మోటార్లు

కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త  మోటార్లు
  • కన్నెపల్లిలో వరదకు కరాబైన వాటి ప్లేస్​లో
  • ఆరింటికి ఆర్డర్‌‌ ఇచ్చిన సర్కార్​
  • ఆస్ట్రియా నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు
  • అక్టోబర్​లో ట్రయల్‌‌‌‌ రన్..'
  • నష్టాన్ని తగ్గించి చూపేందుకు సర్కార్​ పాట్లు
  • ప్రభుత్వ ఆదేశాలతో పనులు స్పీడప్‌‌‌‌ చేసిన ఇంజనీర్లు

భూపాలపల్లి / మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్​హౌస్​లో పూర్తిగా ధ్వంసమైన ఆరు మోటార్ల స్థానంలో కొత్త వాటిని తెప్పించేందుకు రాష్ట్ర సర్కార్ రూ.300 కోట్లతో ఆర్డర్ ఇచ్చింది. పాతవి రిపేర్ చేయడానికి సైతం వీలులేని స్థాయిలో దెబ్బతిన్నాయని ఎక్స్​పర్ట్స్ చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి గోదావరి వరదకు కన్నెపల్లి పంప్​హౌస్​లోని మొత్తం 17 మోటార్లు నీటమునిగిన సంగతి తెలిసిందే. వీటిలో ఆరు పూర్తిగా డ్యామేజీ కాగా, దెబ్బతిన్న మరో 11 మోటార్లకు రిపేర్లు చేస్తున్నారు. వాటి రిపేర్ పనులు కూడా ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేవు. దీంతో కొత్తగా తెప్పించే మోటర్లను యుద్ధప్రాతిపదికన బిగించి అక్టోబరులో ట్రయల్​రన్​చేయాలని ఇంజనీర్లను సర్కారు ఆదేశించింది. 300 కోట్లతో ఒక్కోటి రూ.50 కోట్ల విలువైన ఆరు మోటర్లను ఆస్ట్రియా నుంచి తెప్పిస్తున్నట్లు ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ అధికారి చెప్పారు. ఇవి నెలరోజుల్లో వస్తాయని.. రాగానే బిగించి ట్రయల్​రన్​ చేస్తామని ఆయన వివరించారు.

పరువు కాపాడుకునే ప్రయత్నం
2018లో కాళేశ్వరం పేరు చెప్పి ఎన్నికలకు పోయిన టీఆర్​ఎస్, త్వరలో వచ్చే ఎన్నికల నాటికి అదే కాళేశ్వరంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్​లో ట్రయల్ ​రన్ చేసి నష్టం పెద్దగా లేదని చెప్పుకోవాలని సర్కార్ భావించింది. కానీ నీట మునిగిన మోటార్లను పరిశీలించిన విదేశీ నిపుణులు.. ఆరు మోటార్లు ఏమాత్రం పనికిరావని, మిగిలిన 11 మోటార్లు కూడా అక్టోబర్‌‌‌‌ వరకు రిపేర్‌‌‌‌ చేయడం కష్టమని తేల్చి చెప్పారు. దీంతో పూర్తిగా డ్యామేజీ అయిన ఆరు మోటర్ల స్థానంలో కొత్తవి తెప్పిస్తోంది.  ఈమేరకు ఇంజనీర్లు పనులు స్పీడప్ ​చేశారు. ఒకవేళ కొత్త మోటర్ల రాక ఆలస్యమైతే అన్నారం మోటర్లు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఏది ఏమైనా అక్టోబర్​లో ట్రయల్​రన్ నిర్వహించడం ఖాయమని ఇంజనీర్లు చెప్తున్నారు.

300 కోట్లతో కొత్త మోటార్లు

వరదల వల్ల అన్నారంలో పెద్దగా నష్టం వాటిల్లకున్నా.. కన్నెపల్లిలో మాత్రం ప్రొటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రేన్లు, లిఫ్టు మోటర్లపై పడడంతో ఆరు మోటార్లు తుక్కు తుక్కయ్యాయి. కాళేశ్వరం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్టు అని ఘనంగా చెప్పుకున్న సర్కారుకు దీంతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రతిపక్షాలు సర్కారు తీరుపై దుమ్మెత్తి పోశాయి. కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద పెట్టలేదని ఆరోపించాయి. సరైన ప్లానింగ్ లేకుండా పంప్​హౌస్​లను నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రిటైర్డ్ ఇంజనీర్లు, సాగు నీటిరంగ నిపుణులు కూడా విమర్శించారు. సర్కారు మాత్రం నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. డీవాటరింగ్ పూర్తి కాకముందే కన్నెపల్లి పంప్​హౌస్ నీట మునగడం వల్ల వచ్చే నష్టం కేవలం  రూ.25 కోట్లేనని, అది కూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్​కుమార్ తో చెప్పించింది. డీవాటరింగ్​పూర్తయ్యే దాకా పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దగ్గరికి మీడియా, ప్రతిపక్షాలు వెళ్లకుండా అడ్డుకుంది. ఇంజినీర్లు, ఎలక్ట్రిషియన్లు, కూలీలు పనిస్థలంలో సెల్​ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించింది. కన్నెపల్లిలో డీవాటరింగ్​పూర్తయ్యే సరికి జరిగిన నష్టం వెయ్యి కోట్ల దాకా ఉంటుందనే విషయం సర్కారుకు అర్థమైంది. ఇప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాస్తోంది. కానీ కన్నెపల్లి పంపుల డ్యామేజీకి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో విషయం ప్రపంచానికి తెలిసింది.