పాములేరు వాగుపై మూడు నెలల్లో కొత్త బ్రిడ్జి నిర్మిస్తాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

పాములేరు వాగుపై మూడు నెలల్లో కొత్త బ్రిడ్జి నిర్మిస్తాం : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి, వెలుగు : పాములేరు వాగుపై మూడు నెలల్లో కొత్త బ్రిడ్జి నిర్మిస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం ఆయన భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట శివారులో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జిని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. పాల్వంచ–దమ్మపేట ప్రధాన మార్గంలోని బ్రిడ్జి పిల్లర్‌‌‌‌ కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ఎమ్మెల్యే సూచించారు. 

పాల్వంచ నుంచి వచ్చే భారీ వాహనాలు మాదారం, అన్నపురెడ్డిపల్లి, బుగ్గపాడు మీదుగా దమ్మపేటకు వెళ్లాలని, దమ్మపేట నుంచి వచ్చే వాహనాలు పట్వారిగూడెం, సత్తుపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లాలని తెలిపారు. చిన్న వాహనాలు కంపగూడెం, గొల్లగూడెం, ములకలపల్లి మీదుగా పాల్వంచకు వెళ్లవచ్చన్నారు. కూలిన బ్రిడ్జి స్థానంలో ఎండీఆర్‌‌‌‌ నిధులతో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కొత్త హైలెవల్‌‌‌‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ మంత్రికి పంపుతామని ఎమ్మెల్యే తెలిపారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి మెచ్చ నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకుడు నారాటి ప్రసాద్‌‌‌‌ బ్రిడ్జిని పరిశీలించారు. త్వరగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.