ల్యాప్​టాప్​, పీసీల ఇంపోర్ట్​కు కొత్త రూల్స్..ఆన్​లైన్​లోనే అనుమతి

ల్యాప్​టాప్​, పీసీల ఇంపోర్ట్​కు కొత్త రూల్స్..ఆన్​లైన్​లోనే అనుమతి
  • ఎలాంటి ఇబ్బందులూ ఉండవు డీజీఎఫ్​టీ వెల్లడి

న్యూఢిల్లీ : ఐటీ హార్డ్​వేర్​ ప్రొడక్టుల దిగుమతులకై ఆన్​లైన్​ అథరైజేషన్​ సిస్టమ్​ను  ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త పద్ధతి వెంటనే అమలులోకి వస్తుందని డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ ఫారిన్​ ట్రేడ్​ (డీజీఎఫ్​టీ) సంతోష్​ కుమార్​ సారనాగి గురువారం మీడియాకు వెల్లడించారు. విశ్వసనీయమైన సోర్సుల నుంచే దిగుమతులు వస్తున్నాయా లేదా అనేది మానిటర్​ చేయడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దిగుమతులపై ఆంక్షలు తెచ్చిన నేపథ్యంలో కొన్ని పరిశ్రమ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రూల్స్​ను కొంత  సరళం చేశారు. 

ఆన్​లైన్​ అథరైజేషన్​ సిస్టమ్​దిగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులూ సృష్టించదని, అధికారుల ప్రమేయం అసలే ఉండదని సారనాగి వివరించారు. ఐటీ హార్డ్​వేర్​ ప్రొడక్టులు దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సులు తప్పనిసరని ఈ ఏడాది ఆగస్టు 4 నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధన నవంబర్​ 1 నుంచి అమలవుతుందని కూడా అప్పుడు ప్రకటించింది. చైనా వంటి దేశాల నుంచి  దిగుమతులు తగ్గించి, దేశంలో  ఐటీ హార్డ్​వేర్​ ప్రొడక్టుల తయారీ పెంచాలనేది కూడా ప్రభుత్వ  టార్గెట్​. ఏ దేశం నుంచైనా ఎంత పరిమాణంలోనైనా, ఏ విలువున్న ప్రొడక్టులనైనా దిగుమతి చేసుకోవడానికి ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకోవచ్చని డీజీఎఫ్​టీ వెల్లడించారు. 

కొత్త సిస్టమ్​ తేవడంలో రెవెన్యూ డిపార్ట్​మెంట్​ కూడా తన వంతు పాత్ర పోషించింది. ఆన్​లైన్​లో అప్లికేషన్​ ప్రాసెస్​కు 10 నిమిషాలు పడుతుందని, సింపుల్​ లైసెన్స్​ ఆటోమేటిక్​గానే జారీ అవుతుందని డీజీఎఫ్​టీ చెప్పారు. తిరస్కరానికి గురైన జాబితాలోని కంపెనీలకు మాత్రం అథరైజేషన్స్​ దొరకవని స్పష్టం చేశారు. సెకండ్​ హ్యాండ్​ లేదా రీఫర్బిష్డ్​ ఐటమ్స్​ దిగుమతి కంపెనీలకు కూడా అథరైజేషన్ దొరకదని వివరించారు. ఎందుకంటే, ఆ ఐటమ్స్​కు స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్​ వేరుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆన్​లైన్​ అథరైజేషన్​ సిస్టమ్​ తెచ్చినప్పటికీ, ఐటీ హార్డ్​వేర్​ ప్రొడక్టులు రెస్ట్రిక్టెడ్ ​కేటగిరీలోనే కొనసాగుతాయని, అందులో ఎలాంటి మార్పు లేదని డీజీఎఫ్​టీ స్పష్టం చేశారు.