ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ నిర్మిస్తం: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో కొత్తగా  తెలంగాణ భవన్ నిర్మిస్తం: సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్​ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా మంగవారం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి  బిజీ బిజీగా గడిపారు. తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ భవన్ ఉమ్మడి ఆస్తుల విభజనపై అధికారులతో సమీక్షించారు. రివ్యూ మీటింగ్ లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ) గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ భవన్​ మ్యాప్​ను సీఎం పరిశీలించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత....? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ఆస్తులపై ఆర్సీ పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని, ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్.. 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్.. 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం రేవంత్​రెడ్డి ఆరా తీశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం –2014 ప్రకారం.. 58.32 : 41.68 నిష్పత్తిలో ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అనంతరం ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల పరిస్థితిని సీఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల కింద నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, రిపేర్లు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. సీఎం  రేవంత్​ స్పందిస్తూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని తెలిపారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆస్తుల విభజనపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. 

మార్చిలో శంకుస్థాపన!

ఇటీవల ఢిల్లీలో పర్యటించిన రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి.. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు మార్చిలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఏడాది లోపు భవన నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని ఉమ్మడి భవన్ ఆస్తులను పరిశీలించిన ఆయన సీఎంకు వివరిస్తామన్నారు. కాగా, ఢిల్లీలో ఉమ్మడి ఏపీ కోసం దాదాపు 30 ఏండ్ల కింద భవన్​ను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక.. ఆ భవన్​లో తాత్కాలికంగా విభజించి.. ఏపీకి కొంత పార్ట్​(ఏపీ భవన్​), తెలంగాణకు కొంత పార్ట్​(తెలంగాణ భవన్​) కేటాయించారు. 

కేసీ వేణుగోపాల్​తో సీఎం భేటీ

కేబినెట్​ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, నామినేటెడ్ పదవులపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్​ హైకమాండ్ తో సమాలోచనలు జరిపారు.  మంత్రివర్గంలో కొత్త వారికి చోటు, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తున్న వారిని ఎంపిక చేయడంలో ఎలా ముందుకెళ్దామనే అంశంపై ముఖ్యనేతల సూచనలు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి.. లోథి రోడ్డులోని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలపాటు కేసీ వేణుగోపాల్ తో సీఎం భేటీ అయ్యారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) లో తీసుకున్న నిర్ణయాలను కేసీ వేణుగోపాల్ కు సీఎం రేవంత్​ వివరించారు. ఈ నెల 28 నుంచి అమలు చేయాలని యోచిస్తున్న మరో రెండు గ్యారంటీల వివరాలను తెలిపారు. కొత్త ఏడాది కానుకగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా.. ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్త్ లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులపై చర్చించినట్లు సమాచారం. 

తొలిసారి అధికారిక నివాసానికి

ఢిల్లీలో తెలంగాణ సీఎంకు అధికారికంగా కేటాయించిన తుగ్లక్ రోడ్ –23 నివాసాన్ని మొదటిసారి సీఎం రేవంత్​రెడ్డి  సందర్శించారు. అక్కడే సాయంత్రం ఎంపీలు, పలువురు పొలిటికల్​ లీడర్లకు  సీఎం రేవంత్​ విందును ఏర్పాటు చేశారు.