జైలర్​ కావాలనుకొని..గ్రూప్​1 పేపర్ ​చోరీ

జైలర్​ కావాలనుకొని..గ్రూప్​1 పేపర్ ​చోరీ
  • జైలర్​ కావాలనుకొని..గ్రూప్​1 పేపర్ ​చోరీ
  • సిట్ విచారణలో నిందితుడు ప్రవీణ్ ​వెల్లడి!
  • నెట్​వర్క్​ అడ్మిన్​ రాజశేఖర్​తో కలిసి కాన్ఫిడెన్షియల్​ సిస్టమ్​హ్యాక్​ చేసినట్టు వెలుగులోకి.. 
  • 6  పేపర్స్‌‌ కొట్టేసి 3 లీక్ చేసినట్లు సిట్​ గుర్తింపు

హైదరాబాద్‌‌, వెలుగు : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్​ కేసులో కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్‌‌ వేసుకోవాలనే కోరికతోనే ప్రధాన నిందితుడు ప్రవీణ్‌‌ గ్రూప్‌‌1 పేపర్ ను దొంగిలించాడని సిట్​ దర్యాప్తులో తేలింది. తండ్రి అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేయడంతో తాను కూడా ఖాకీ యూనిఫామ్ ను వేసుకోవాలని ప్రవీణ్‌‌ కోరుకున్నాడని వెల్లడైంది. గ్రూప్‌‌1 పరీక్ష రాసి డీఎస్పీ లేదా జైలర్ అయ్యేందుకే క్వశ్చన్​ పేపర్‌‌‌‌  చోరీకి ప్లాన్ చేశానని దర్యాప్తులో  ప్రవీణ్‌‌ అంగీరించాడు.

ఇందుకోసమే సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి కాన్ఫిడెన్షియల్​ సిస్టమ్‌‌ నుంచి గ్రూప్‌‌1 పేపర్ ను దొంగిలించానని  సిట్ అధికారులకు చెప్పాడు. ఎగ్జామ్​లో రాంగ్‌‌ బబ్లింగ్‌‌ చేయడం వల్లే తాను గ్రూప్​1లో సక్సెస్​ కాలేకపోయానని ప్రవీణ్​ తెలిపాడు. ఆ తర్వాతే .. టీఎస్‌‌పీఎస్సీ  నిర్వహించే అన్ని పరీక్షల పేపర్స్‌‌ను సేల్‌‌ చేయాలని ప్లాన్ చేశానని వివరించాడు. ఈ క్రమంలోనే నెట్‌‌వర్క్‌‌ అడ్మిన్‌‌ రాజశేఖర్‌‌‌‌రెడ్డిని కలిసి..  అతడి జీతం పెంచేలా టీఎస్‌‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌‌కు సిఫార్సు చేస్తానని తాను చెప్పినట్లు ఒప్పుకున్నాడు.

ఆ తర్వాత రెగ్యులర్​ ప్రాసెస్‌‌లోనే రాజశేఖర్‌‌‌‌రెడ్డి జీతం పెరిగిందని.. అయితే తన వల్లే శాలరీ పెరిగిందని అతడికి చెప్పానని విచారణలో ప్రవీణ్  తెలిపాడు.  ఇలా రాజశేఖర్‌‌‌‌రెడ్డితో కలిసి సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి సిస్టమ్‌‌ డైనమిక్‌‌ ఐపీని, స్టాటిక్‌‌ ఐపీగా మార్చానని వెల్లడించాడు. గ్రూప్‌‌1 సహా మరో ఐదు పేపర్స్‌‌కు చెందిన మాస్టర్ క్వశ్చన్ పేపర్స్‌‌ను పెన్‌‌డ్రైవ్‌‌లోకి డౌన్‌‌లోడ్ చేసుకున్నానని సిట్‌‌ విచారణలో స్పష్టం చేశాడు. ఇందులో 3 పేపర్స్‌‌ ను సేల్‌‌ చేశానని ప్రవీణ్​ అంగీకరించాడు.

రాంగ్‌‌ బబ్లింగ్‌‌ చేసిన 8000 మందితో వాట్సప్ ​గ్రూప్​లు  

గ్రూప్‌‌1‌‌ పేపర్స్ ను లీక్​ చేసిన సంగతి బయటపడకపోవడంతో అసిస్టెంట్‌‌ ఇంజినీర్‌‌‌‌ సహా ఒక్కో పేపర్ ను  అమ్మేందుకు రాజశేఖర్‌‌‌‌తో కలిసి ప్లాన్ వేశానని ప్రవీణ్​ వివరించాడు. ఓఎంఆర్​ షీట్​లో రాంగ్‌‌ బబ్లింగ్‌‌ చేయడం వల్ల చాలామంది అభ్యర్థుల ఫలితాలు హోల్డ్​లో ఉండిపోయాయని..  ఈవిధంగా టీఎస్‌‌పీఎస్సీకి వచ్చిన అభ్యర్థులను  ట్రాప్ చేయడం ప్రారంభించానని చెప్పాడు.

ఈ క్రమంలో పలువురు యువతులతో మాట్లాడుతూ వారి అవసరాలను గుర్తించినట్లు తెలిపాడు. డీఏఓ పరీక్ష రాసిన సుష్మితను కూడా ట్రాప్ చేసేందుకు యత్నించానని సిట్​ విచారణలో ప్రవీణ్​ వెల్లడించాడు. ఇలా గ్రూప్‌‌1 పేపర్‌‌‌‌లో రాంగ్ బబ్లింగ్ చేసిన దాదాపు 8000 మంది అభ్యర్థులతో వాట్సప్‌‌ గ్రూప్స్‌‌ ను ప్రవీణ్​క్రియేట్‌‌ చేశాడని సిట్‌‌ గుర్తించింది. వీరంతా తమ సమస్యలను వాట్సప్ ​గ్రూప్స్‌‌లో చర్చించేవారని ఓ సిట్‌‌ అధికారి తెలిపారు.

ఈ గ్రూప్స్‌‌లో ప్రవీణ్‌‌ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రవీణ్, రాజశేఖర్‌‌‌‌లను మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తామన్నారు.  కాగా, డీఏఓ పరీక్ష రాసిన సుష్మిత ఆమె భర్త సాయి లౌకిక్‌‌ను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్​ ఫైల్‌‌ చేశారు.