
వంట చేయడంలో చెఫ్స్ తమ స్పెషాలిటీ చూపిస్తేనే కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. అందుకే కొందరు వంట మాస్టర్లు కొత్త రకం వంటలు సృష్టిస్తుంటారు. ఇంటర్నెట్ వల్ల అప్పుడప్పుడూ అలాంటి కొత్త రకం వంటలు ప్రపంచానికి తెలుస్తుంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతోంది అలాంటి ఒక ఫుడ్ వీడియో. అదే ఫైర్ దోసె. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇప్పుడిది నెటిజన్లను ఆకర్షిస్తోంది. దోసెల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పడం కష్టం. ఎవరికి వాళ్లు తమకు నచ్చిన రీతిలో దోసెకు మార్పులు చేసి, కొత్త దోసె తయారుచేస్తుంటారు. పిజ్జా దోసె, ఫ్లయింగ్ దోసె, జీనీ దోసె, టోపీ దోసె.. బోలెడు వెరైటీలు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి కొత్తగా చేరింది ‘ఫైర్ దోసె’. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఒక హోటల్‌లో ఫైర్ దోసె తయారుచేస్తున్నారు. పెనంపైన కాల్చడంతోపాటు దోసెపైన కూడా మంట వచ్చేలా కాల్చడమే దీని స్పెషాలిటీ. ఈ దోసె తయారీలో చీజ్, బటర్, క్రీమ్, సాస్, కూరగాయలు వాడుతున్నారు. దీని ధర రూ.180. అమర్ సిరోహి అనే ఫుడ్ వ్లాగర్ ఈ దోసె తయారీ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తే, అది వైరల్‌గా మారింది.