శ్రీసీతారామచంద్రస్వామి సేవలకు కొత్త వాహనాలు

శ్రీసీతారామచంద్రస్వామి సేవలకు కొత్త వాహనాలు
  •  తమిళనాడులోని కుంభకోణంలో తయారీ    
  • అమెరికాలోని వాసవీ అసోసియేషన్​ విరాళం 

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి సేవలకు కొత్త వాహనాలు వస్తున్నాయి. తమిళనాడులోని కుంభకోణంలో 12 వాహనాలు ముస్తాబవుతున్నాయి. అమెరికాలోని వాసవీ అసోసియేషన్ దాదాపు రూ.60లక్షల వ్యయంతో వీటిని తయారు చేయిస్తోంది.  గరుడ, హనుమత్, శేష, సూర్యప్రభ, చంద్రప్రభ, హంస, అశ్వ, కల్పవృక్ష, సార్వభౌమ, బంగారు సింహాసనం, గజ, సింహ వాహనాలను ఇత్తడితో చేయిస్తున్నారు. కొన్నింటికి బంగారు పూత కూడా చేయిస్తున్నారు. పనులు పరిశీలించేందుకు వైదిక కమిటీ నుంచి అమరవాది మురళీకృష్ణమాచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు, ఈవో శివాజీలు తమిళనాడు వెళ్లారు. శ్రీరామనవమి నాటికి ఈ వాహనాలు రెడీ అవుతాయి.  శ్రీరామనవమి, శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాల్లో ఈసారి ఈ వాహనాలను వినియోగించనున్నారు. మూడు శతాబ్ధాల కింద రామదాసు కాలం నాటి వాహనాలనే ప్రస్తుతం వాడుతున్నారు. హనుమత్ వాహనాన్ని మాత్రం ప్రముఖ సినీనటుడు స్వర్గీయ ఎస్వీ రంగారావు తయారు చేయించి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ప్రతీ ఉత్సవానికి వీటిని రిపేర్​ చేయించి వాడాల్సి వస్తోంది. గతేడాది జులై 3న భద్రాచలం ఆలయం నుంచి అమెరికా వెళ్లి  శ్రీసీతారాముల కల్యాణాన్ని అక్కడ వాసవీ అసోసియేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆలయంలో వాహనాలు శిథిలావస్థకు వచ్చిన తీరును వేదపండితులు ఎన్ఆర్ఐ వాసవీ అసోసియేషన్​ దృష్టికి తీసుకొచ్చారు. కల్యాణంలో పాల్గొన్న కొందరు భక్తులు స్పందించి సీతారాములకు వాహనాలు తయారు చేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఒక్కో వాహనానికి సుమారు రూ.5లక్షలు ఖర్చు అవుతోంది. 

మార్చి 31న  శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం

పన్నెండేళ్లకొకసారి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం మార్చి 31న నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్​స్వామి పర్యవేక్షణలో జరిగే పట్టాభిషేకానికి  దేశంలోని 12 ప్రధాన నదులు గంగా, యమున, గోదావరి, కృష్ణా, బ్రహ్మపుత్ర, మహానది, కావేరీ, సింధు, నర్మదా, తపతి, తుంగభద్ర, సరస్వతిల నుంచి జలాలతో పాటు 12 పుష్కర తీర్థాల నుంచి, నాలుగు దిక్కుల నుంచి సముద్ర జలాలను తీసుకురానున్నారు. ఇందుకు వైదిక కమిటీ నుంచి ఇద్దరు, ఆలయ ఉద్యోగి ఒకరితో ఒక టీం తయారు చేసి మొత్తం నాలుగు టీంలను దేశం నలుమూలలకు పంపుతున్నారు. వీరు సముద్ర, నదీ జలాలను తీసుకురానున్నారు.