
- 100 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు
- బ్రూక్, సోఫీ హాఫ్ సెంచరీలు
గువాహటి: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన న్యూజిలాండ్ విమెన్స్ జట్టు ఎట్టకేలకు వన్డే వరల్డ్ కప్‌లో బోణీ చేసింది. బ్రూక్ హాలీడే (69), సోఫీ డివైన్ (63) హాఫ్ సెంచరీలు చేయడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కివీస్ 100 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌కు చెక్ పెట్టింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 227/9 స్కోరు చేసింది. ఆరంభంలో చెలరేగిన బంగ్లా బౌలర్లు కివీస్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేశారు. ఓపెనర్లలో సుజీ బేట్స్ (29) మెరుగ్గా ఆడినా, జార్జియా ప్లిమెర్ (4), అమెలియా కెర్ (1) విఫలమయ్యారు. దాంతో న్యూజిలాండ్ 38/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో సోఫీ, బ్రూక్ నిలకడగా ఆడారు. బంగ్లా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని నాలుగో వికెట్‌కు 112 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. అయితే 29 రన్స్ తేడాతో ఈ ఇద్దరు ఔట్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. మ్యాడీ గ్రీన్ (25) మోస్తరుగా ఆడినా.. ఇసాబెల్లా గాజె (12), జెస్ కెర్ర్ (0), రోస్‌మేరీ మైర్ (2) నిరాశపర్చారు.
లీ తహుహు (12 నాటౌట్) చొరవతో స్కోరు 200లు దాటింది. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్ 3 వికెట్లు తీసింది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ 39.5 ఓవర్లలో 127 రన్స్‌కే ఆలౌటైంది. ఫాతిమా ఖాతున్ (34) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేయడంతో బంగ్లా టాప్ ఆర్డర్ తేలిపోయింది. రుబ్యా హైదర్ (1), షర్మిన్ అక్తర్ (3), నిగర్ సుల్తానా (4), శోభన మోస్తరీ (2), సుమయా అక్తర్ (1), షోర్నా అక్తర్ (1) ఘోరంగా ఫెయిలయ్యారు. ఫలితంగా బంగ్లా 33/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ టైమ్‌లో ఫాతిమా, నహిదా అక్తర్ (17), రాబెయా ఖాన్ (25) పోరాటం చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. జెస్ కెర్ర్, లీ తహుహు చెరో మూడు, మైర్ రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూకీ హాలీడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.