
డెలివరీ కోసం హాస్పిటల్‌కు వస్తే నర్సు నిర్లక్ష్యంతో పుట్టిన బిడ్డ చనిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. కాటారం మండలం గారేపల్లికి చెందిన శారద దేవేందర్ దంపతులు గత నెల15 న డెలివరీ కోసం మహదేవపూర్ సామాజిక హాస్పిటల్‌కు వచ్చారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న శారదకు డ్యూటీ నర్స్ అరుణ తనకు తెలిసిన అరకొర వైద్యం తో రెండు ఇంజక్షన్లు చేసింది. దీంతో పరిస్థితి విషమించి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆపరేషన్ చేయాలని పెద్దాసుపత్రి కి తీసుకెళ్లండని డాక్టర్లు వరంగల్ కు రిఫర్ చేశారు.
వరంగల్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్లు డెలివరీ చేశారు. కాగా బిడ్డ చికిత్స పొందుతూ చనిపోయింది. నర్సు అరుణ ఇచ్చిన ఇంజక్షన్ వల్లే బాబుకు ఇన్ఫెక్షన్ సోకి మెదడుపై తీవ్ర ప్రభావం చూపి చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. పెండ్లైన ఏడేండ్ల కు కలిగిన సంతానాన్ని నర్సు నిర్లక్ష్యంతో కోల్పోయామని బాధితులు బోరుమన్నారు. ఇన్ని రోజులు తల్లి ఆరోగ్యం సరిగాలేనందున ఫిర్యాదు చేయలేకపోయారు. కాగా సోమవారం తమ బిడ్డ చావుకు కారణమైన నర్సు అరుణ పై చర్యలు తీసుకోవాలని మహదేవపూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డికి ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకుంటాం..
శారద డెలివరీ విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సు అరుణను సస్పెండ్ చేశాం. జిల్లా ఆఫీసర్ల నుంచి ఉత్తర్వులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం.
– వాసుదేవరెడ్డి, సీహెచ్ సీ సూపరింటెండెంట్ మహదేవపూర్‌జాకారంలో