న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడులు.. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం

న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడులు.. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం

మనీలాండరింగ్, చైనాకు అనుకూలంగా కంటెంట్‌ను తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రచురించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసుకు సంబంధించి న్యూస్‌క్లిక్ మీడియాకు సంబంధించిన ప్రదేశాలపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దాడులు చేసింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని మీడియా సంస్థ అధికారులు, ఉద్యోగుల నివాసాలపై దాడులు జరుగుతున్నాయి. దాదాపు 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నామని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. ఉద్యోగుల వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సంజయ్ రాజౌరా, భాషా సింగ్, ఊర్మిళేష్, ప్రబీర్ పుర్కాయస్థ, అభిసర్ శర్మ, ఔనింద్యో చక్రవర్తి, సోహైల్ హష్మీల స్థలాలపై ఈ ఉదయం పోలీసులు దాడులు చేశారు. వారి ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు జప్తు చేశారు. అనేక మంది జర్నలిస్టులు దీనిపై స్పందిస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులను ( న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న) పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని వారు ఆరోపించారు. న్యూస్‌క్లిక్‌లోని జర్నలిస్టులలో ఒకరైన అభిసార్ శర్మ.. తన ల్యాప్‌టాప్‌ను పోలీసులు ఎత్తుకెళ్లారని, ఢిల్లీ పోలీసులు తన ఇంటికి వచ్చారని చెప్పారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కేసులో న్యూస్‌క్లిక్‌ను ఈడీ విచారిస్తోంది, ఇందులో వార్తా సంస్థ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి రూ. 38 కోట్లు తీసుకుని, దాన్ని భారతదేశంలో చైనా అనుకూల ప్రచారానికి ఉపయోగించిందని ఆరోపించింది. సింఘం చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

Also Read :- ఇండియన్ విస్కీకి వరల్డ్ నంబర్ వన్ అవార్డ్