105 గంటల్లో 75 కిలోమీటర్ల రోడ్డు..గిన్నీస్ రికార్డు

105 గంటల్లో 75 కిలోమీటర్ల రోడ్డు..గిన్నీస్ రికార్డు

న్యూఢిల్లీ: నేషనల్‌‌ హైవైస్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఎన్‌‌హెచ్‌‌ఏఐ) అరుదైన రికార్డును సాధించింది. 105 గంటల్లో 75 కిలోమీటర్ల రోడ్డును నిర్మించి గిన్నీస్‌‌ వరల్డ్‌‌ రికార్డ్‌‌ సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌‌ గడ్కరీ బుధవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతి, అకోలా మధ్య ఎన్‌‌హెచ్‌‌ 53లో 105 గంటల్లో 75 కిలోమీటర్ల రోడ్డును ఎన్‌‌హెచ్‌‌ఏఐ, రాజ్‌‌పథ్‌‌ ఇన్‌‌ఫ్రాకాన్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, జగ్‌‌దీశ్‌‌ కదం సంయుక్తంగా ఈ రోడ్డును నిర్మించారు. తక్కువ సమయంలో రేయింబవళ్లు కష్టపడి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆయా సంస్థలతో పాటు కార్మికులు, ఇంజనీర్లు, వర్కర్లకు నితిన్‌‌ గడ్కరీ అభినందనలు తెలిపారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమని చెప్పారు. జూన్‌‌ 3న ఉదయం 7.27 గంటలకు మొదలైన రోడ్డు నిర్మాణ పనులు జూన్‌‌ 7 సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 105 గంటల 33 నిమిషాల్లో 75 కిలోమీటర్ల రోడ్డును వేసినట్లు తెలిపారు. ఇందులో 800 మంది ఎన్‌‌హెచ్‌‌ఏఐ ఉద్యోగులు, 720 మంది రాజ్‌‌పథ్‌‌ ఇన్‌‌ఫ్రాకాన్‌‌ వర్క్‌‌ర్లు తదితరులు పాల్గొన్నట్లు చెప్పారు. హైవే 53లో భాగమైన అమరావతి నుంచి అకోలా రహదారి ఈస్ట్‌‌కోస్ట్ కారిడార్‌‌‌‌లోని చాలా ముఖ్యమైనదని గడ్కరీ పేర్కొన్నారు. ఇది కోల్‌‌కత్తా, రాయ్‌‌పూర్‌‌‌‌, నాగ్‌‌పూర్‌‌‌‌, అకోలా, ధులే, సూరత్‌‌ వంటి సిటీలను కలుపుతుందని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్‌‌ లేకుండా జర్నీ సాఫీగా సాగుతుందని, ప్రయాణ సమయం కూడా 
తగ్గుతుందని తెలిపారు.