ఏడుగురు నిర్దోషులే.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో NIA కోర్టు సంచలన తీర్పు

ఏడుగురు నిర్దోషులే.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో NIA కోర్టు సంచలన తీర్పు

ముంబై: దాదాపు 17 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు తీర్పుపై నెలకొన్ని ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం (జూలై 31) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ సహా మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది ఎన్ఐఏ కోర్టు. నిందితులకు వ్యతిరేకంగా నేరం రుజువు చేయడానికి ప్రాసిక్యూషన్ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. పేలుడులో వాడిన బైక్‌ సాధ్వి ప్రజ్ఞాకు చెందినదిగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని.. నిందితులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో ఏడుగురిని నిర్దోషులు ప్రకటిస్తున్నట్లు కోర్టు తెలిపింది. 

2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ మసీదు సమీపంలో భారీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైక్‎కు ఐఈడీ బాంబు అమర్చి విధ్వంసానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి సహా మరికొందరు నిందితులుగా ఉన్నారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఈ ఘటనను సీరియస్‎గా తీసుకుని విచారించింది. 

ఏటీఎస్ దాదాపు మూడేళ్లు విచారించిన అనంతరం.. ఉగ్ర కుట్ర కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2011లో ఈ కేసును టేకప్ చేసింది. ఈ కేసు విచారణ 17 ఏళ్లు జరగగా.. దాదాపు 200 మందికి పైగా సాక్షులను విచారించింది. పేలుళ్లకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ పేరుపై రిజస్ట్రేషన్ చేయబడిందని ప్రాసిక్యూషన్ వాదించినప్పటికీ అందుకు తగ్గ ఆధారాలు చూపించలేకపోయింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు.. 2025  ఏప్రిల్ 19న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం (జూలై 31) ఈ కేసు తుది తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ సహా నిందితులకు భారీ ఊరట దక్కింది.