విరసం మాజీ సభ్యుల ఇండ్లల్లో ఎన్ఐఏ సోదాలు

విరసం మాజీ సభ్యుల ఇండ్లల్లో ఎన్ఐఏ సోదాలు
  •     వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, రవిశర్మ ఇండ్లల్లో తనిఖీలు
  •     మావోయిస్ట్ సందీప్ దీపక్ కేసులో భాగంగా ఎన్​ఐఏ రెయిడ్స్

హైదరాబాద్, వెలుగు: విరసం మాజీ సభ్యుల ఇండ్లల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) గురువారం సోదాలు జరిపింది. హైదరాబాద్​ హిమాయత్ నగర్లోని వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంటితో పాటు ఎల్బీనగర్ శ్రీనివాస నగర్ కాలనీలోని విరసం మాజీ సభ్యుడు రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 10గంటల వరకు సోదాలు నిర్వహించారు. సెల్ఫోన్స్ సీజ్ చేశారు. ఇంట్లోని బుక్స్ ఇతర అనుమానాస్పద డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

మావోయిస్టు సందీప్ దీపక్ రావు 
కేసు దర్యాప్తులో భాగంగానే.. 

మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సందీప్ దీపక్ రావును గతేడాది సెప్టెంబర్ 15న రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ సెక్రటరీగా సందీప్ దీపక్రావు కీలక పాత్ర పోషించాడు. ఎన్ఐఏతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక పోలీసుల వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. అతనిపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేషియా టౌన్ షిప్లో దీపక్రావును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులోనే దీపక్రావు తో సంబంధాలు ఉన్నాయని వేణుగోపాల్, రవిశర్మతో పాటు కేరళకు చెందిన మరో ముగ్గురినీ నిందితులుగా చేర్చారు. సందీప్ దీపక్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ సోదాలు జరిపింది. కబలి దళం పేరుతో మీటింగ్లు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సోదాల్లో వేణుగోపాల్ ఇంట్లో ‘నయీం బెదిరింపులు, భూకబ్జాల’పై ఆయన రాసిన పుస్తకాలు, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. రవిశర్మ ఇంట్లో కొన్ని పాంప్లెట్స్, సెల్ఫోన్, బుక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.

దాడులను ఖండిస్తున్నాం : ప్రొఫెసర్ హరగోపాల్

నక్సలిజం సాకుతో ఎన్ఐఏ ఎవరిపై పడితే  వారిపై దాడులు చేస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇవ్వాలి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, రవిశర్మ ఇండ్లపై దాడులను ఖండిస్తున్నాం. ఎన్ఐఏ అధికారుల విపరీత పోకడలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.