
మైదుగురి: నైజీరియాలో బొకో హరామ్ ఇస్లామిక్ టెర్రరిస్టులు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూకుమ్మడిగా ఓ గ్రామంపై విరుచుకుపడ్డారు. గ్రామస్తులను ఊచకోత కోశారు. ఇళ్లల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు. ఇండ్లను తగులబెట్టారు. టెర్రరిస్టుల దాడిలో 63 మంది గ్రామస్తులు చనిపోయారని అధికారులు తెలిపారు. టెర్రరిస్టుల దాడి నుంచి తప్పించుకునేందుకు గ్రామస్తులు పరుగులు పెట్టారు. దాదాపు వందమందికి పైగా గ్రామస్తులు పారిపోయారని వివరించారు. టెర్రరిస్టులు దాడి చేసిన దారుల్ జమాల్ గ్రామాన్ని బోర్నో స్టేట్ గవర్నర్ బాబాగానా జులుమ్ శనివారం సాయంత్రం సందర్శించారు. స్థానికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పారిపోయిన వారు తిరిగి రావాలని, వారికి భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత బాబాగానా జులుమ్ మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్ టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. స్థానికులు గ్రామాన్ని వదిలివెళ్లవద్దని, వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే టెర్రరిస్టుల దాడిలో ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టిస్తామని, సామగ్రి కోల్పోయిన వారికి కొత్త సామగ్రి అందిస్తామని చెప్పారు. బామా స్థానిక ప్రభుత్వ చైర్మన్ మొదు గుజ్జ కూడా ఈ దాడిపై స్పందించారు. పదుల సంఖ్యలో ఇండ్లను టెర్రరిస్టులు దహనం చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. బొకో హరామ్ లో జామా అతు అహ్లిస్ సున్నా లిద్దా అవతి వల్ జిహాద్ అనే వర్గం ఈ దాడికి పాల్పడిందని తైవో అడెబాయో అనే రీసెర్చర్ తెలిపారు.