
- ఎక్విప్మెంట్లను ప్రారంభించిన నిమ్స్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: కీళ్ల నొప్పులు, కండరాల సమస్యలు, క్రీడా గాయాలతో బాధపడేవారికి నిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో రోగులకు వైద్య సేవలు మరింత వేగంగా అందనున్నాయి. దీని కోసం 3 అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకొచ్చారు. సుమారు రూ.40 లక్షల విలువైన ఈ ఎక్విప్మెంట్లను నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగరి బీరప్ప బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోగులకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ కర్తవ్యమని అన్నారు.
ఈ కొత్త పరికరాలు రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వివిధ రకాల శారీరక సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరితగతిన ఉపశమనం కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిమ్స్ ఎల్లప్పుడూ రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు, ఫిజియోథెరపీ హెచ్వోడీ డాక్టర్ శ్రావణ్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.