నిమ్జ్‌‌ పనులకు బ్రేక్ !.. పరిహారం చెక్కుల పంపిణీలో ఆలస్యం

నిమ్జ్‌‌ పనులకు బ్రేక్ !.. పరిహారం చెక్కుల పంపిణీలో ఆలస్యం

 

  •     గత నెలలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఆఫీసర్లు, ఓ ఉద్యోగి
  •     ఆ తర్వాత నెమ్మదించిన నిమ్జ్‌‌ పనులు
  •     ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై ఇన్‌‌చార్జి డిప్యూటీ కలెక్టర్‌‌ ?
  •     ఫేజ్-1 భూసేకరణకు నోటిఫికేషన్ వచ్చినా కదలని ఫైళ్లు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌లోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) పనులకు బ్రేక్‌‌ పడింది. భూ సేకరణతో పాటు సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు వ్యవహారం ముందుకు సాగడం లేదు. జులై ఫస్ట్‌‌ వీక్‌‌ వరకు పనులు స్పీడ్‌‌గానే సాగాయి. కానీ పరిహారం చెల్లింపు విషయంలో అవకతవతలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ నిమ్జ్‌‌ ఆఫీస్‌‌పై దాడి చేయగా.. పలువురు ఆఫీసర్లు పట్టుబట్టారు. ఆ తర్వాత నిమ్జ్‌‌ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

12 వేల ఎకరాల్లో నిమ్జ్‌‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్‌‌ మండలాల పరిధిలో మొత్తం 17 గ్రామాల్లో 12,635 ఎకరాల్లో నిమ్జ్‌‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉండగా.. గత సర్కార్‌‌ పాలనలో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్జ్‌‌ భూసేకరణ పనులు స్పీడందుకున్నాయి. ఫేజ్-1, ఫేజ్-2లో భాగంగా ఇప్పటివరకు ఏడు వేల ఎకరాలకు పైగా భూములను సేకరించారు. ఫేజ్-1కు సంబంధించి మరో 352 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. ఆయా భూముల పరిహారానికి సంబంధించిన చెక్కులు కూడా నిమ్జ్‌‌ ఆఫీస్‌‌లో సిద్ధంగా ఉన్నా పంపిణీ మాత్రం జరగడం లేదు. బాధిత రైతులు పరిహారం కోసం నిమ్జ్‌‌ ఆఫీస్‌‌ చుట్టూ తిరుగుతున్నారు.

జూలై 10 నుంచి ఆగిన పనులు

నిమ్జ్‌‌ భూ పరిహారం చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జహీరాబాద్‌‌లోని నిమ్జ్‌‌ ఆఫీస్‌‌పై జూలై 10న ఏసీబీ ఆఫీసర్లు దాడి చేశారు. ఈ వ్యవహారంలో నిమ్జ్‌‌ స్పెషల్‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌ రాజిరెడ్డి, స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌‌ సతీశ్‌‌, డ్రైవర్‌‌ దుర్గయ్య ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. దీనివల్ల భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యం జరగకూడదని జహీరాబాద్‌‌ ఆర్డీవో రాంరెడ్డికి నిమ్జ్‌‌ స్పెషల్‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌గా ఇన్‌‌చార్జ్‌‌ బాధ్యతలు అప్పగించారు. అయితే చెక్కుల పంపిణీలో ఆరోపణలు, ఏసీబీ దాడులతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భూసేకరణతో పాటు పరిహారం చెల్లింపుల విషయంపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిమ్జ్‌‌ పనుల విషయంలో ఉన్నతాధికారులు ఆర్డీవోపై ఒత్తిడి తేవడంతో ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. ఏసీబీ భయంతో నిమ్జ్‌‌ ఆఫీస్‌‌లో ఫైళ్లను ముట్టుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే 
నిలిచిపోయాయి.

నిమ్జ్‌‌లో 500 కంపెనీలు

జహీరాబాద్‌‌ నిమ్జ్‌‌ ప్రాంతంలో నాన్‌‌ పొల్యూషన్‌‌కు సంబంధించి 500కు పైగా భారీ, చిన్న తరహా ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. డిఫెన్స్, ఏరోనాటిక్స్‌‌, స్పేస్ రంగంలో ఉపయోగించే పరికరాలను ఉత్పత్తి చేసే వెమ్‌‌ టెక్నాలజీతో అగ్రిమెంట్‌‌ జరుగగా.. రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేయనున్న కంపెనీలకు 511 ఎకరాలు కేటాయించారు. జర్మనీకి చెందిన ఆటోమేటివ్‌‌ విడిభాగాల కంపెనీ, ఎలక్ట్రిక్‌‌ వాహనాల తయారీ కంపెనీలు హ్యూందాయ్‌‌, టైటాన్‌‌ మోటార్స్‌‌తో సైతం ఒప్పందాలు జరిగాయి. సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌‌బాబు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన టైంలోనూ నిమ్జ్‌‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు అంగీకరించాయి. కానీ అసలు పనులు మొదలయ్యే టైంలో కొందరు ఆఫీసర్ల చేతివాటం, మరికొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్‌‌ పనులు ముందుకు సాగడం లేదు.

మైనార్టీ వెల్ఫేర్‌‌ ఆఫీసర్‌‌కు బాధ్యతలు అప్పగించాం 

నిమ్జ్‌‌ భూ సేకరణ, పరిహారం పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడం లేదు. ఏసీబీ రైడ్‌‌కు సంబంధించిన ఇష్యూలో జరిగిన లోటుపాట్ల పనులు మాత్రమే నిలిచిపోయాయి. మిగతా పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. జహీరాబాద్ ఆర్డీవో శుక్రవారం నుంచి 12 రోజుల పాటు లీవ్‌‌లో వెళ్లారు. అతని స్థానంలో మైనార్టీ వెల్ఫేర్‌‌ జిల్లా ఆఫీసర్‌‌ దేవుజకు బాధ్యతలు అప్పగించాం. నిమ్జ్‌‌ పనుల విషయంలో కలెక్టర్‌‌ ప్రావీణ్య ఎప్పటికప్పుడు రివ్యూల చేస్తున్నారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.   - పద్మజారాణి, డీఆర్‌‌వో