నీ రాక కోసం.. చిన్న సార్ కోసం ఆశావహుల వెయిటింగ్

నీ రాక కోసం..  చిన్న సార్ కోసం ఆశావహుల వెయిటింగ్
  • నీ రాక కోసం..
  • చిన్న సార్ కోసం ఆశావహుల వెయిటింగ్
  • తొలుత దుబాయ్ వెళ్లాలనుకున్న నేతలు
  • ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకొన్న ముగ్గురు
  • వాళ్ల ఫోన్లకు రెస్పాండ్ కాని మంత్రి కేటీఆర్
  • రావద్దని మెస్సేజ్.. రేపు హైదరాబాద్ లోనే కలుద్దామని రిప్లయ్

మంత్రి కేటీఆర్ రాక కోసం తొమ్మిది మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఓ ముగ్గురు నేతలు సెప్టెంబర్ 5న దుబాయ్ లోనే కేటీఆర్ ను కలవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం వాళ్లు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఉదయం దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమై ఫోన్ చేయగా తానే వస్తున్నానని కేటీఆర్ సదరు నేతలకు మెస్సేజ్ పంపినట్టు తెలిసింది. దీంతో వారు తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు.

జాబితాకు రెండు రోజుల ముందే అమెరికాకు 

తన కుమారుడు హిమాన్షును అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో జాయిన్ చేసేందుకు మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు రెండు రోజుల ముందే ఆయన ఫ్లయిట్ ఎక్కేశారు. అలా ఆయన అమెరికా వెళ్లిపోయాక సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందులో కేటీఆర్ టీమ్ గా ఉన్న ముగ్గురికి మాత్రమే టికెట్లు వచ్చాయి. వారిలో జాన్సన్ నాయక్ (ఖానాపూర్), అనిల్ జాదవ్ (బోథ్), కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల) ఉన్నారు.

ఆయనపైనే ఆశలు పెట్టుకున్న 9 మందికి టికెట్లు దక్కలేదు. ఈనెల 2న ఆయన అమెరికా నుంచి తిరిగా రావాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో కేటీఆర్ రాక రేపటికి (సెప్టెంబర్ 6కి) వాయిదా పడింది. కేటీఆర్ వస్తున్న ఫ్లయిట్ వయా దుబాయ్ వస్తోంది. అక్కడ ఆయన 12 గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో తమ గోడును వెళ్లబోసుకొని ఎలాగైనా టికెట్లు సాధించుకోవాలని పలువురు నేతలు భావించారు. కానీ కేటీఆర్ మెస్సేజ్ తో నేతలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. 

ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్ 

టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి హామీ దక్కిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అభినందనలు. సిరిసిల్ల అభ్యర్థిగా తనను మరోసారి నామినేట్ చేసిన గౌరవనీయ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ధన్యవాదాలు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకు సాగాలి. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న మన్నె క్రిశాంక్ (కంటోన్మెంట్ ) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. పోటీ అవకాశం ఉన్నా తిరస్కరణకు గురైన క్రిశాంక్ తో పాటు మిగతావారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే భరోసా పార్టీ ఇస్తుంది’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అదే సమయంలో మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి తీరునూ కేటీఆర్ తప్పుపట్టారు.

కేటీఆర్ కోసం వెయిట్ చేస్తున్నది వీళ్లే..!

మన్నె క్రిశాంక్ (కంటోన్మెంట్)

శంభీపూర్ రాజు (కుత్బుల్లాపూర్ )

బొంతు రామ్మోహన్ (ఉప్పల్ )

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (జనగాం)

సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్)

నీలం మధు (పటాన్ చెరు)

ఢిల్లీ వసంత్ (జహీరాబాద్)

మన్నె గోవర్థన్ రెడ్డి (ఖైరతాబాద్)

బాబా ఫసియొద్దీన్ (జూబ్లీహిల్స్)