దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనకు తొమ్మిదేళ్లు

దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనకు తొమ్మిదేళ్లు

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటన జరిగి ఇవాళ్టితో తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. 2013 ఫిబ్రవరి 21న రెప్పపాటులో సంభవించిన పేలుళ్లధాటికి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పటికీ హైదరాబాద్ వాసుల్నీ వెంటాడుతూనే ఉంది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేష్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ భత్కల్ సహా ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ ఐదురినీ దోషులుగా తేల్చిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. 2016 డిసెంబర్ 19న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి...

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్ లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌ (యూపీ), జియా-ఉర్‌-రెహమాన్‌ (పాకిస్థాన్‌), తెహసీన్‌ అక్తర్‌ (బీహార్‌), అజాజ్‌ షేక్‌ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీనితో పాటు దాదాపు పదికి పైగా బాంబు పేలుళ్ల ఘటనల్లో యాసిన్ భత్కల్ పాత్ర ఉంది.

అమలు కాని శిక్ష.. బాధితులకు అందని పరిహారం

దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు జరిగి.. తొమ్మిదేళ్లు గడుస్తున్నా నేటికీ దోషుకు శిక్ష అమలు కాలేదు. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 2016 చివరిలోనే ఉరి శిక్ష ఖరారు చేసినా.. ఇంకా అమలు కాలేదు. మరోవైపు  పేలుళ్లలో గాయపడిన వారికి ఇన్నేండ్లుగా నష్ట పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం బాధితులకు అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులను వెంటనే ఉరితీయాలని, తమకు న్యాయం చేయాలని నాటి ఘటన బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

నేను డబ్బు ఇవ్వను... మీరూ తీసుకోవద్దు

ఉక్రెయిన్లో టెన్షన్: రష్యా ఆధీనంలోని పౌరుల తరలింపు!