ఉక్రెయిన్లో టెన్షన్: రష్యా ఆధీనంలోని పౌరుల తరలింపు!

ఉక్రెయిన్లో టెన్షన్: రష్యా ఆధీనంలోని పౌరుల తరలింపు!

ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు మూడు వైపులా రష్యా బలగాలు మోహరించి ఉన్నాయి. మరోవైపు యుద్ధ పరిస్థితులు ఏర్పడకుండా మిత్ర దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. బలగాలను వెనక్కి పిలవాలని కోరారు. ఉక్రెయిన్ ఉద్రిక్తతుల నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో భేటీ అయ్యేందుకు అంగీకరించారు. మాక్రన్ ప్రపోజల్ కు ఇద్దరు నాయకులు ఓకే చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయకుండా నిలిపి, శాంతి, సామరస్యాలను నెలకొలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్ష భవనం వెల్లడించింది. 

నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు దిగింది. బెలారస్ తో ఆదివారం ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే.. ఏదో ఒక సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్  ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్ లోని తమ పౌరుల భద్రత ప్రమాదంలో పడిందనే నెపంతో యుద్ధానికి దిగవచ్చని నాటో దేశాలంటున్నాయి.

రష్యా ఆధీనంలోని పౌరుల తరలింపు!

తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ లో ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. భారీ బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. రష్యా అనుకూల తిరుగుబాటు దళాలు బాంబులతో తమపై విరుచుకుపడుతున్నాయని, తాము మాత్రం ప్రతిదాడులు చేయడం లేదని ఉక్రెయిన్ సైన్యం చెబుతోంది. మరోవైపు తమ ఆధీనంలోని ప్రాంతాల్లోని పౌరులను రష్యాకు తరలించే ప్రక్రియను తిరుగుబాటు నేతలు ముమ్మరం చేశారు. 7లక్షల మంది రష్యాకు వెళ్లేందుకు వీలుగా పాస్ పోర్టులను జారీ చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు యూరప్ అంతటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ఉక్రెయిన్ పై దాడికి దిగితే రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే విషయంలో యూరప్ దేశాలన్నీ కలిసి రావాలని కోరారు. 

ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులతో.. అక్కడి భారత ఎంబసీ సిబ్బంది కుటుంబీకులంతా వెంటనే వచ్చేయాలని కేంద్రం సూచించింది. ఉక్రెయిన్ లో ఉండే భారతీయులు కూడా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని చెప్పింది. అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ ఫ్లైట్లలో దేశానికి రావాలని.. వివరాల కోసం ఎంబసీని సంప్రదించాలని NRIలకు సూచించింది. మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉక్రెయిన్  నుంచి భారత్ కు ఎయిరిండియా విమానాలుండటంతో.. భారత ఎంబసీ సిబ్బంది కుటుంబీకుల కోసం ప్రత్యేక విమానం పంపే ఆలోచన లేదన్నారు అధికారులు.

మరిన్ని వార్తల కోసం..

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు 

చిల్లర పైసలతో స్కూటీ కొన్నడు