
- 17 సర్జరీలు, శరీరంలో 32 రాడ్లు, మెడలో 50 పతకాలు
పుట్టుకతోనే వెన్నెముక ఎదగకుండా పుట్టాడు. దీనికి తోడు అడుగు కూడా సరిగ్గా వేయరాకుండా దొడ్డికాళ్లు. ఆ పిలగాణ్ణి చూసి తల్లిదండ్రులు కుమిలిపోయారు. కానీ.. ఇప్పుడతను ఒక విజేత. తన జీవితాన్ని ఎంతోమందికి ఆదర్శంగా చూపిన స్ఫూర్తిదాత.
నిరంజన్ ముకుందన్. కర్ణాటకలోని బెంగళూరుకు చెందినవాడు. వెన్నెముక సరిగ్గా ఎదగకముందే పుట్టేశాడు. దొడ్డికాళ్లతో నడుస్తాడో, లేదో కూడా డౌటే. స్పిన్ బైఫిడా అనే వెన్నెముక సంబంధ వ్యాధి కారణంగా నిరంజన్ వెన్నెముక ఎదగలేదు. వెన్నెముక సరిగ్గా ఎదగకపోయినప్పటికీ నిరంజన్‌కి తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉండేవి. తల్లిదండ్రులు నిరంజ్నిచూసి ప్రతిరోజూ ఏడ్చేవారు. ఎన్నో పూజలు, నోములు చేశారు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగారు. చివరికి ఓ సీనియర్ డాక్టర్ నిరంజన్‌కి గుర్రపుస్వారీ, ఈత నేర్పమని సలహా ఇచ్చాడు. వెన్నెముకనే సరిగ్గా లేనివాడు గుర్రాన్ని ఎలా స్వారీచేస్తాడు? ఈత ఎలా కొడతాడు అని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కానీ.. ఆ రెండే నిరంజన్ పాలిట వరమయ్యాయి.
ఈత కొట్టడం, గుర్రపుస్వారీ చేయడం వల్ల బాడీలో ఎక్కువ భాగాలు కదులుతాయి. శరీరం మొత్తం చురుగ్గా మారుతుంది. కానీ.. నిరంజన్ గుర్రపుస్వారీ చేయలేడు. అందుకే ఈతను ఎంచుకున్నాడు. ఈత నేర్చుకోవడానికి అతని సైజుకు సరిపడా ఓ బాత్‌టబ్ కొని అందులో నిరంజన్‌ని వదిలేశారు. చేతులు, కాళ్లు కదిలించడం చాలా కష్టంగా ఉందతనికి. కొద్దిగా మాత్రమే కదిలించగలుగుతున్నాడు. ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని తల్లిదండ్రులు అతడిని నీళ్లలోంచి బయటకు తీశారు. బయటకు వచ్చాక నిరంజన్ తన కాళ్లు కొంచెం కూడా కదిలించలేకపోయాడు.
హేళనను గెలిచాడు..
బయట తన శరీరాన్ని ఏమాత్రం కదిలించలేని తను.. నీళ్లలో మాత్రం కాళ్లు చేతులు ఆడించగలిగాడు. ఈ విషయం నిరంజన్‌కి అర్థమైంది. అంతే.. ఈతనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. క్రమక్రమంగా బాత్‌టబ్‌లో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత ఎప్పట్లాగే నిరంజన్ బాత్‌టబ్‌లో ఈత ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి బాత్‌టబ్ పగిలిపోయింది. తను కాస్త పెరిగాడు. ఇంకా బాత్‌టబ్‌లో ఈత ప్రాక్టీస్ చేయొద్దని ఫిక్సయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో ఓ స్విమ్మింగ్‌పూల్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అది 50 అడుగుల పొడవు, 25 మీటర్ల అడ్డం ఉండేది. మామూలుగా అయితే.. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నిరంజన్ వయసు పిల్లలయితే ఈత నేర్చుకోవడానికి 20 నుంచి 25 రోజులు పడుతుంది. కానీ.. నిరంజన్ మాత్రం ఆరు రోజుల్లోనే ఈత నేర్చుకున్నాడు. అంతే.. అప్పటి నుంచి ఈత కొట్టడానికే తన పూర్తి సమయం కేటాయించేవాడు. ఈ టైంలో చాలామంది నిరంజన్‌ని చిన్నచూపు చూశారు. ‘ఈత నేర్చుకొని గోల్డ్ మెడల్ సాధిస్తావా’ అంటూ హేళన చేశారు. కానీ.. నిరంజన్‌కి తన విల్‌పవర్ ఏంటో తెలుసు. జయానగర్‌లోని స్విమ్మింగ్ క్లబ్లో జాన్ క్రిస్టోఫర్ అనే కోచ్ దగ్గర ఈతలో టెక్నిక్స్ నేర్చుకున్నాడు. ఆయన సలహాతోనే జాతీయ స్థాయి ఈత పోటీల్లో కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించాడు. కానీ.. రేసులో అందరికంటే లాస్ట్ వచ్చాడు.
ప్రాక్టీసే పరమావధిగా..
కోచ్ దగ్గరికి వెళ్లి ‘నేను పోటీలకు పనికిరాను’ అని బాధపడ్డాడు. కానీ కోచ్ వదిలిపెట్టలేదు. ‘కష్టపడితే ఫలితం ఉంటుంది. కష్టానికి ఫలితం రావాలంటే ఓపిగ్గా ఎదురుచూడాలి’ అని చెప్పాడు. ఆ మాటతో నిరంజన్‌లో కసి, పట్టుదల పెరిగింది. అరగంట ఆగకుండా స్విమ్ చేయడం ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ఆ టైంను గంటకుపెంచాడు. కొన్నిరోజుల తర్వాత మూడు గంటలకు పెంచాడు. అలా కష్టపడి ఇప్పుడు నిరంజన్ ఏకంగా తొమ్మిది గంటలు ఆగకుండా ఈత కొట్టగలడు. చాలా శ్రమ తర్వాత మరోసారి ఈత పోటీల్లో పాల్గొన్నాడు. పోయినసారి లాస్ట్ వచ్చిన నిరంజన్ ఈసారి అందరి కంటే ముందే రేసు పూర్తిచేశాడు. పదేళ్ల వయసులో పదహారు గంటల పాట సుదీర్ఘంగా 17 సర్జరీలు చేశారు. కాళ్లు నిటారుగా రావడానికి, వెన్నెముకకు సపోర్ట్ గా ఉండడానికి ఆ సర్జరీలు. ఆ ఆపరేషన్‌లో నిరంజన్ శరీరంలో మొత్తం 32 స్టీల్ రాడ్లు అమర్చారు. ఆ తర్వాత వాటిని తీసేశారు.
‘ఏకవల్య’ అందుకున్నాడు..
బెర్లిన్‌లో 2010లో జరిగిన ఐడీఎం జర్మన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అందులో 200 మీ పోటీలో కాంస్య పతకం అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మెడల్స్ రావడం ప్రారంభమైంది. విరామం లేకుండా ఈత పోటీల్లో పాల్గొనడం వల్ల నిరంజన్ శరీరానికి చేసిన సర్జరీ తాలూకు గాయాలు తిరగబెట్టాయి. ఆరు నెలలు మంచానికే పరిమితం అయ్యాడు. ఈ కారణంగా నిరంజన్ 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనలేకపోయాడు. దృష్టి మొత్తం ఏషియన్ పారా గేమ్స్ మీద పెట్టాడు. అక్కడ కూడా కాంస్య పతకం సాధించాడు.
ఆ తర్వాత 2015లో నెదర్లాండ్స్‌లో జరిగిన 11వ ఇంటర్నేషనల్ వీల్‌చెయిర్ యాంప్యూటీ స్పోర్ట్స్‌లో ఏకంగా ఏడు బంగారు పతకాలు, మూడు వెండి పతకాలు సాధించాడు. దీంతో ట్రోపీలో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 124 గంటల 52 నిమిషాల్లో 5846 కిలోమీటర్ల దూరం కారు నడిపి లిమ్కా బుక్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత ఏషియన్ పారా స్విమ్మింగ్ వరల్డ్ సిరీస్‌లో 200 మీటర్లు వెనక్కి ఈది ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో ఆయన వెన్నెముక బాగా దెబ్బతిన్నది.
మళ్లీ రెండున్నర నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ పోటీల్లో ఐదు బంగారు పతకాలు సాధించాడు. 2015లో నిరంజన్ కృషిని, పట్టుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ పారా స్పోర్ట్స్‌మెన్ అవార్డు, ఏకలవ్య అవార్డులు ఇచ్చి గౌరవించింది. ఇప్పటి వరకు నిరంజన్ తను పాల్గొన్న అన్నీ పోటీల్లో కలిపి 50 పతకాలు సాధించాడు.