హైకోర్టు వారం గడువుపై నిర్భయ తల్లి సంతోషం

హైకోర్టు వారం గడువుపై నిర్భయ తల్లి సంతోషం

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశాదేవి. నిర్భయ దోషులు వారం రోజుల్లోగా తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. అయితే వారం రోజుల గడువు ముగిసాక వీలైనంత త్వరగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసి శిక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. డెత్‌ వారెంట్లపై స్టే విధించిన పటియాలా హౌస్‌ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు కోర్టు నిరాకరించింది. శిక్ష అమలు ఆలస్యానికి నిర్భయం దోషులు చేసే ప్రయత్నాన్ని హైకోర్టు లెక్కలోకి తీసుకుని.. వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.