రోడ్లపై చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్

రోడ్లపై చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్

సారంగాపూర్, వెలుగు: గ్రామాల్లోని రోడ్లు, ప్రధాన కూడళ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని నిర్మల్​కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో అయన పర్యటించారు. చించోలి (బి) గ్రామంలోని పల్లె ప్రకృతివనం, నర్సరీని అయన సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గ్రామంలో దుకాణదారులు, వ్యాపారస్తులు చెత్తను రోడ్ల మీద వేయకుండా నియంత్రించాలని, అలా వేసేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. 

అనంతరం ఆలూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ రైతు విధిగా ఆధార్, బ్యాంక్ పాస్​బుక్, పట్టా పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, ఫోన్ నెంబర్ ను అందజేయాలని కోరారు. ఆ తర్వాత ధని గ్రామంలోని పాఠశాలను తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కేటాయిచిన నిధులతో మౌలిక సదుపాయాలు, రిపేర్లు పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్​వెంట జిల్లా పంచాయతీ అధికారి గోవింద్, డీఈఓ రవీందర్ రెడ్డి, సారంగాపూర్ తహసీల్దార్ శ్రీదేవి, అధికారులు, సిబ్బంది  తదితరులు ఉన్నారు.