నిర్మల్, వెలుగు: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నిర్మిస్తున్న పీహెచ్సీలు, సబ్సెంటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో పీహెచ్సీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తవ్వాలని చెప్పారు. అలాగే, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు, ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ చందు జాదవ్, ఇరిగేషన్ ఈఈ అనిల్, పీఆర్ డీఈ తుకారాం తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
లోకేశ్వరం, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశించారు. బుధవారం హవర్గాలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులు, మద్దతు ధరతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వడ్లు కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ కిశోర్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో సల్మాన్ రాజ్, రైతులున్నారు.
