కరెంట్​ కోతలకు నిరసనగా రాస్తారోకో

కరెంట్​ కోతలకు నిరసనగా రాస్తారోకో

కుభీర్, వెలుగు : కరెంట్​కోతలను నిరసిస్తూ  నిర్మల్ ​జిల్లా కుభీర్​ మండలంలోని గోడాపూర్ గ్రామస్తులు, రైతులు మండల కేంద్రంలోని సబ్​స్టేషన్​ ముట్టడించి ధర్నా  చేశారు. కుభీర్- –భైంసా రోడ్డుపై బైఠాయించి గంటపాటు రాస్తా రోకో చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్​ఇస్తామని చెబితే పంటలు వేశామని, ఇప్పుడు అప్రకటిత కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా వినలేదు. విద్యుత్​శాఖ ఏఈ ముల్లా అజిమొద్దీన్​అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలతో పాటు కొందరు రైతుల అక్రమ కనెక్షన్లతో లోడ్ పెరిగిపోయి ఇలా జరుగుతోందన్నారు. మంగళవారం నుంచి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.