నిర్మల్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లేనట్లే..

నిర్మల్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లేనట్లే..
  • నిర్మల్ జిల్లాకు మరోసారి నిరాశ
  • బోధన్ లో ఏర్పాటుకు సన్నాహాలు
  •  భూ సేకరణ ప్రయత్నాల్లో ప్రీ యూనిక్ కంపెనీ
  • జిల్లాలో ఇప్పటికే నిలిచిపోయిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల వద్ద నిర్మించతలపెట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ఇరిగేషన్ శాఖ బ్రేక్ వేయడంతో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి వద్ద నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. జిల్లాలోని పాక్ పట్ల గ్రామంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించేందుకు మొన్నటి వరకు ప్రీ యూనిక్ కంపెనీ అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ఫ్యాక్టరీ నిర్మించే స్థలం గోదావరి ఫ్లడ్ లెవెల్ పరిధిలో ఉంది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అధికారులు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. 

ఫ్యాక్టరీకి పొల్యూషన్ బోర్డుతోపాటు ఇతర అన్ని రకాల అనుమతులు లభించినప్పటికీ ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి జారీ కాలేదు. దీంతో ఏడాదిన్నరగా పరిశ్రమ పనులు మొదలు కాలేదు. దీంతో ప్రీ యూనిక్ కంపెనీ నిజామాబాద్​ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి వద్ద ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో నిర్మల్ జిల్లాకు మొండిచేయి ఎదురైనట్లే కనిపిస్తోంది. గతంలో కూడా బాసర వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్​ను నిర్మించాలని తలపెట్టి భూసేకరణ కూడా పూర్తిచేశారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ పరిశ్రమను మరో జిల్లాకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన రెండు పరిశ్రమలు 
చేజారినట్లయ్యింది.

1335 ఎకరాల్లో మొదటి దశ దిగుబడి

జిల్లావ్యాప్తంగా దాదాపు పదివేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగవుతోంది. మొత్తం 1335 ఎకరాల్లో మొదటి దశ దిగుబడి చేతికొచ్చింది. ఒక ఎకరానికి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 150 ఎకరాలకు సంబంధించిన పంట కొనుగోళ్లు మొదలయ్యాయి. టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.18,500 ప్రీ యూనిక్ కంపెనీ రైతులకు చెల్లిస్తోంది. పంటను అమ్మిన రైతులకు వారం, పది రోజుల్లో డబ్బులు చెల్లించనున్నట్లు హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు చేసిన పంటను ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. 

నిర్మల్​కు ప్రత్యామ్నాయంగా బోధన్

పాక్ పట్ల వద్ద మొదట ఫ్యాక్టరీ నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం స్థలం కేటాయించింది. దీంతో పొల్యూషన్ బోర్డు, పరిశ్రమల శాఖ నుంచి ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఈ అనుమతులు రావడంతో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 అక్టోబర్​లో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్ శాఖ ఈ స్థలంపై సర్వే చేపట్టింది. రికార్డుల ఆధారంగా ఈ స్థలం గోదావరి నది ఫ్లడ్ లెవెల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించింది. 

ఎన్ఓసీ జారీ చేయలేదు. ఈ ప్రాంతంలో పరిశ్రమ నిర్మించవద్దంటూ కంపెనీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. అయితే పాక్​పట్ల వద్ద ఏర్పాటుకు అనుమతులు రాకపోవడంతో నిర్మల్ తోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు అందుబాటులో ఉండేందుకు బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రీ యూనిక్ కంపెనీ భావిస్తోంది.