నిర్మల్, వెలుగు: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ బోర్డు పరీక్షల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్కాలేజీల్లో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో 66 52 మంది ఫస్టియర్, 6473 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని, ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి సెంటర్లో తాగునీరు, వైద్య సిబ్బంది, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. కాపీయింగ్ కు తావులేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం, డీఈవో భోజన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
