ఈసారైనా నిర్మల్​కు వరద బాధ తప్పేనా?

ఈసారైనా నిర్మల్​కు వరద బాధ తప్పేనా?
  • ఆక్రమణలతో కుచించుకుపోయిన నాలాలు
  • స్వర్ణ ప్రాజెక్టు, జౌళి నాలా ద్వారా ముంచెత్తుతున్న వరద
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాగితాలకే పరిమితం
  • నేడు నిర్మల్ లో విపత్తుల నివారణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పర్యటన

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణాన్ని ఏటా వానాకాలంలో వరద గండం వెంటాడుతోంది. ఇక్కడ అనే కందకాలు, నాలాలు, చెరువు భూములు కబ్జాకు గురవడమే ఇందుకు కారణం. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిస్తే చాలు పట్టణమంతా జలమయమై పోతుంది. నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులతోపాటు వాటికి ఆనుకొని ఉన్న కందకాలు, ప్రధాన నాలాల ఆక్రమణలతో అవి కుచించుకుపోయాయి. దీంతో వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద ఇళ్లలోకి చేరుతోంది. రానున్నది వానాకాలం. ఈ నేపథ్యంలో విపత్తుల నివారణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ శనివారం నిర్మల్ లో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

వానాకాలం పేరెత్తితేనే భయం

నిర్మల్ లోని సిద్ధాపూర్ వరకు ప్రవహించే స్వర్ణ కాలువ పరివాహకంలో ఉన్న జీఎన్ఆర్ కాలనీ వాసులు వర్షాకాలం పేరెత్తితేనే భయపడుతున్నారు. గతేడాది స్వర్ణ ప్రాజెక్టు గేట్లను ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎత్తడంతో వరద నీరంతా ఈ కాలనీని ముంచెత్తింది. స్థానికులను కాపాడేందుకు పట్టణ ప్రజలు, అధికార యంత్రాంగం శ్రమించాల్సి వచ్చింది. ఇళ్లలో ఇసుక మేటలు వేశాయి. అలాగే, పట్టణంలోని పాత బస్తీ గుండా ప్రవహించే జౌళి నాలా ఆక్రమణలకు గురైంది. వర్షాకాలంలో ఈ నాలా పొంగిపొర్లుతుండడంతో రామారావుబాగ్, బెస్తవారిపేట, కాల్వ గడ్డ, రామ్ మందిర్, షేక్ సాహెబ్​పేట్, కుర్రన పేట్ ముంపునకు గురవుతున్నాయి. 

ధర్మసాగర్ చెరువు ఆక్రమణకు గురవడం, ఇక్కడి పంట పొలాలు కనుమరుగై, పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరగడంతో  ప్రియదర్శిని నగర్, మస్తాన్ దుబ్బా, మంజులాపూర్ వార్డులు వానాకాలంలో మునిగిపోతున్నాయి. కంచరోని చెరువు కింద ఉన్న విద్యానగర్, ఆదర్శ్ నగర్ వాసులు కూడా ముంపు బాధితులే.  నిర్మల్ లోని ప్రధాన కందకం ఆక్రమణతో ఇందిరా నగర్, శాస్త్రి నగర్, రవినగర్ వాసులు ఏటా వర్షపు నీటితో సతమతమవుతున్నాయి. డాక్టర్స్​లేన్ ప్రధాన రోడ్డు నీటమునుగుతోంది. పల్లె చెరువు, గండి రామన్న గుట్టల ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి కారణంగా విశ్వనాథ్ పేట్, 
గాజులపేట, వైఎస్సార్ కాలనీ ముంపునకు గురవుతున్నాయి.  

అటకెక్కిన అండర్​ డ్రైనేజీ ప్రతిపాదనలు

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో నిర్మల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.60 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించేందుకు అప్పట్లో మున్సిపల్ అధికారులతో కమిటీని కూడా నియమించారు. నిధుల కొరత కారణంగా డ్రైనేజీ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఇప్పటికీ నాయకుల హామీలకే పరిమితమవుతు న్నాయన్న విమర్శలున్నాయి. 15 వార్డుల్లోని మురికి నీరంతా జౌళి నాలా గుండా ప్రవహిస్తోంది. ఇది మరో మూసీ నదిగా మారిపోయిందని స్థానికులు అంటున్నారు. కనీసం శుభ్రం చేయడం లేదని, ఇందులో బురద పేరుకుపోయి చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగాయని, ఫలితంగా మురికి నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.