
పొలిటీషియన్ కావాలంటే….ఏళ్ళ తరబడీ శ్రమపడాలి. జిల్లా పరిషత్ లెవెల్ నుంచో, మున్సిపాలిటీ లెవెల్ నుంచో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగినా కూడా….స్టేట్ లో మినిస్టర్ గా కూడా కాలేకపోవడం చాలామందికి అనుభవమే. అట్లాంటిది, ఎలాంటి పొలిటికల్ అనుభవమూ లేకుండా, సొంత కేడర్ అనేది కూడా లేకుండా నేషనల్ పాలిటిక్స్ కు ఎదగడమే గ్రేట్ అనుకుంటే….అక్కడితో ఆగకుండా, సెంట్రల్ మినిస్టర్ కావడం,అందులోనూ డిఫెన్స్, ఫైనాన్స్ శాఖలు నిర్వహించడం ఒక్క నిర్మలా సీతారామన్ కే చెల్లింది. అందుకే….దేశాధినేతలు, సూపర్ బిజినెస్ఉమెన్ కే చోటుండే ప్రపంచంలోని 100 మంది పవర్ ఫుల్ ఉమెన్ లిస్ట్ లో ఫోర్బ్స్ ఆమెను చేర్చింది. నిర్మలా సీతారామన్ ఇంత ఎదగడానికి తెలివితేటలు, దూసుకెళ్ళే స్వభావం, చొరవే కారణాలని ఎనలిస్టులు అంటారు.
మన దేశ రాజకీయాల్లో అనూహ్యంగా ఎదిగిన లీడర్ నిర్మలా సీతారామన్. రాజకీయాల్లో 13ఏళ్ల కాలం అంటే చాలా తక్కువ టైం కిందే లెక్క. అయితే ఇంత తక్కువ టైంలోనే ఆమె డిఫెన్స్, ఫైనాన్స్ వంటి మంత్రి పదవులను చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. నిర్మల కంటే ముందు ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో ఈ కీలకమైన శాఖలను చూశారు. అయితే డిఫెన్స్, ఫైనాన్స్ పోర్టుఫోలియోలను ఇండిపెండెంట్‌గా, ఫుల్ టైమ్ చూసిన తొలి మహిళ నిర్మలా సీతారామనే.
నిర్మల కు పాలిటిక్స్‌లో గాడ్ ఫాదర్ లంటూ ఎవరూ లేరు. ఆమె సొంతూరు మధురై. తండ్రి రైల్వే ఉద్యోగి. తరచూ ట్రాన్స్ ఫర్లు కావడంతో దాదాపు తమిళనాడు అంతా తిరిగారు. పీజీ చదువుకు వచ్చేటప్పటికి ఆమె ఢిల్లీ చేరారు. అక్కడి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చదువు ఆమె జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇక్కడే ఎకనామిక్స్ లో ఆమె పీజీ చేశారు. తరువాత ‘ఇండో యూరోపియన్ టెక్స్ టైల్ ట్రేడ్’ సబ్జెక్ట్ పై పీహెచ్డీ కి ఎన్ రోల్ చేసుకున్నారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలపై ఆమెకు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థలో పనిచేయడంతో ప్రపంచ రాజకీయాలు, అక్కడి ఆర్థిక పరిస్థితులపై పట్టు సాధించారు. 2006లో బీజేపీ లో చేరిన తరువాత పార్టీ తరఫున టీవీ చర్చల్లో ఆమె తరచూ పాల్గొనేవారు. వాగ్దాటితో, సంబంధిత టాపిక్స్ పై ఉన్న నాలెడ్జ్ తో తన వాదన గట్టిగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో పార్టీలో చేరిన నాలుగేళ్లకే ఆమెను పార్టీ ప్రతినిధిగా నియమించిన బీజేపీ హై కమాండ్… తరువాత రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చి ఆమె సేవలు వినియోగించుకుంది.
2014లో మోడీ కేబినెట్లోకి ….
2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక నిర్మలా సీతారామన్ కు కామర్స్ శాఖ సహాయ మంత్రి పదవి లభించింది. నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో వాణిజ్యానికి చాలా ప్రాధాన్యం ఉండేది. మోడీ ఏ దేశం వెళ్లినా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపేవారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా నిర్మలా సీతారామన్ చేసేశారు. యూరోపియన్ దేశాల వాణిజ్యానికి సంబంధించిన అన్ని విషయాలపై ఆమెకు పట్టు ఉండటంతో ఏయే ఒప్పందాలు కుదుర్చుకోవచ్చో, దాని వల్ల మనదేశానికి ఎంత లాభమో ముందుగా పేపర్ తయారు చేసుకునేవారు. నిర్మల ప్రిపేర్ చేసిన పేపర్ ఆధారంగా విదేశాలతో ప్రధాని మోడీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే వారు. కామర్స్ అంశానికి సంబంధించి నిర్మలకు ఉన్న నాలెడ్జ్ ఆమెకు ఎంతగానో ఉపయోగపడింది. తరువాత ఫైనాన్స్ వంటి ఇంపార్టెంట్ మినిస్ట్రీని ఆమెకు అప్పగించడానికి ప్రధాని మోడీ ధైర్యం చేయగలిగారు. నిర్మల కేంద్ర మంత్రి అయినా నిత్య విద్యార్థినిగానే భావిస్తారు. పాలిటిక్స్, ఫైనాన్స్ , కామర్స్ వంటి అనేక అంశాలపై నాలెడ్జ్ ను ఆమె ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటారు. దీనికోసం ప్రతిరోజూ దాదాపు పది డైలీ పేపర్లను ఆమె ఆసాంతం చదువుతారు. అవసరమైన పాయింట్స్ ను నోట్ చేసి పెట్టుకుంటారు.
ఇగోను పట్టించుకోని లీడర్
కీలకమైన ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నా నిర్మలా సీతారామన్ ఏ రోజూ ఇగో తో ప్రవర్తించలేదని ఆమెతో కలిసి పనిచేస్తున్న అధికారులు అంటారు. ఫైల్ లో ఏదైనా తెలియనప్పుడు సంబంధిత అధికారిని పిలిచి ఆ సబ్జెక్ట్ కు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకునేవారట. ‘‘ఫలానా ఇష్యూ గురించి నాకు తెలియదు. మీరే వివరించండి ’’అని ఇగోను పక్కనపెట్టి అడిగేవారట. రాజకీయ నాయకుల్లో ఇలా ఇగో లేకుండా ప్రవర్తించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారంటారు పై స్థాయి అధికారులు.
రాత్రి 8.30 వరకు ఆఫీసులోనే……
డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రతి రోజూ రాత్రి ఎనిమిదిన్నర వరకు నిర్మల ఆఫీసులోనే ఉండేవారట. దీంతో సహజంగా సాయంత్రం కాగానే ఇంటికి వెళ్లడానికి అలవాటు పడ్డ అధికారులు ఆమె ఉన్నంత సేపు ఆఫీసులోనే ఉండాల్సి వచ్చేదట.నిర్మల కారణంగా తమకు ప్రతిరోజూ ఓవర్ టైమ్ తప్పడం లేదని సరదాగా అనుకునేవారట.
నిర్మలా సీతారామన్ సహజంగా వివాదాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడతారు. అందులో కూడా సమస్యలే ప్రధానంగా ఉంటాయి. అయితే ఎవరైనా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఏమాత్రం సహించరు. తన మార్క్ వాగ్దాటితో, లెక్కల వివరాలతో ఎదుటివారిని కంట్రోల్ చేసేస్తారు. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నా ఏమాత్రం తీరిక దొరికినా క్లాసికల్ మ్యూజిక్ వినడాన్ని ఆమె ఇష్టపడతారు.ట్రావెల్ చేస్తుంటారు. ట్రెక్కింగ్ అంటే ఆమె కు చాలా ఇష్టం.