
- పెట్టుబడి వ్యయానికి 1.5 రెట్ల ఆదాయం వచ్చేలా చర్యలు
- ఏడాదిలో మద్దతు ధరతో రూ.1,72,752 కోట్ల వరి కొనుగోళ్లు
- బడ్జెట్లో అగ్రికల్చర్‌కు రూ.1,31,531 కోట్లు.. గతేడాది కంటే 5.63% ఎక్కువ
- ఇందులో సగానిపైగా ‘పీఎం కిసాన్’కే రైతు రుణాల టార్గెట్ 16.5 లక్షల కోట్లు
- పలు వస్తువులపై అగ్రి సెస్.. లీటర్ పెట్రోల్‌పై 2.5, డీజిల్‌పై రూ.4 విధింపు
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 5.63 శాతం ఎక్కువ ఫండ్స్ వచ్చాయి. వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు గతేడాది రివైజ్డ్ బడ్జెట్ అలకేషన్స్ 1,24,519 కోట్లు కాగా, తాజాగా రూ.1,31,531 కోట్లను కేంద్రం కేటాయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు. ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు ఆదాయం వచ్చేలా ఎంఎస్పీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేశామని వెల్లడించారు. ఆహార ధాన్యాల సేకరణ, రైతులకు చెల్లింపులు భారీగా పెరిగాయని అన్నారు. గత ఆరేండ్లలో వరి, గోధుమలు, పప్పుధాన్యాలు, పత్తి తదితర పంటల సేకరణ చాలా రెట్లు పెరిగిందని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లు భారీగా పెంచినం
గత ఆరేళ్లలో ధాన్యం కొనుగోళ్లను భారీగా పెంచామని నిర్మల చెప్పారు. ఎంఎస్పీ కింద గోధుమల కొనుగోలుకు సంబంధించి.. 2013–14లో రైతులకు రూ.33,874 కోట్లు చెల్లించగా, 2020–-21లో 75 వేల కోట్లు చెల్లించామని వివరించారు. ఇలా 2019–20లో 35.57 లక్షల మంది, 2020-–21లో 43.36 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. ఇక వరి సేకరణకు సంబంధించి 2019–20లో 1.2 కోట్ల మంది, 2020–21లో 1.54 కోట్ల మంది లబ్ధి పొందారన్నారు. పప్పుధాన్యాల కొనుగోళ్లను ఆరేండ్లలో 40 రెట్లు పెంచామన్నారు. పత్తికి 2013–14లో 90 కోట్లు మాత్రమే చెల్లించగా, 2020–21లో ఇప్పటిదాకా 25,974 కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్, బంగారంపై అగ్రి సెస్
ఆల్కహాలిక్ బేవరేజెస్, బంగారం, వెండి, పత్తి, బఠానీలు, యాపిల్, పెట్రోల్, డీజిల్‌తో సహా పలు స్పెసిఫైడ్ వస్తువులపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వివిధ వస్తువులపై 2.5% నుంచి 100% దాకా సెస్ విధించనున్నట్లు తెలిపారు. బంగారం, వెండిపై 2.5%, ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 100%, క్రూడ్ పామ్ ఆయిల్‌పై 17.5%, క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20%, యాపిల్స్‌పై 35%, ఫర్టిలైజర్లపై 5%, పత్తిపై 5% విధించారు. ఈ సెస్ మంగళవారం నుంచే అమల్లోకి రానుందని చెప్పారు. ‘‘రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు మేం పత్తిపై కస్టమ్స్ సుంకాన్ని 10% విధించాం. అలాగే ముడి పట్టు, పట్టు నూలుపై 10% నుంచి 15 శాతానికి పెంచుతున్నాం” అని అన్నారు. లీటర్ డీజిల్పైరూ.4, పెట్రోల్‌పై రూ.2.5 అగ్రికల్చర్ సెస్ విధిస్తున్నట్లు చెప్పారు. ఈ అగ్రి సెస్ వల్ల వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపారు. జనంపై ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సెస్ విధించడం వల్ల పెట్రోల్, డీజిల్, ఆల్కాహాల్ రేట్లు పెరగవని చెప్పారు. ఇందుకోసం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రేట్లు తగ్గించినట్లు వెల్లడించారు.
మరో కోటి మందికి ‘ఉజ్వల’
ఉచితంగా వంట గ్యాస్ అందించేందుకు సంబంధించిన ఉజ్వల స్కీమ్‌ను మరో కోటి మంది లబ్ధిదారులకు వర్తింపచేయనున్నట్లు నిర్మల చెప్పారు. వాహనాలకు సీఎన్జీని అందుబాటులోకి ఉంచేందుకు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇండ్లకు పైప్డ్ కుకింగ్ గ్యాస్ ను మరో 100 జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.
ఎకనమిక్ హబ్‌లుగా ఐదు హార్బర్లు..
ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, సీ వీడ్ ఫార్మింగ్‌ను ప్రమోట్ చేసేందుకు భారీ పెట్టుబడులను నిర్మల ప్రతిపాదించారు. కొచ్చి, చెన్నై, వైజాగ్, పారాదీప్, పెటువాఘాట్ హార్బర్లను ఎకనమిక్ యాక్టివిటీ హబ్‌లుగా డెవలప్ చేస్తామని చెప్పారు. తమిళనాడులో సీవీడ్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు.
కేటాయింపులు ఇలా..
- కేటాయింపుల్లో సగానికి పైగా ఫండ్స్‌ను ‘పీఎం కిసాన్’ స్కీమ్‌కే కేంద్రం వాడుకోనుంది. పీఎం కిసాన్ స్కీమ్‌కు రూ.65 వేల కోట్లు అలకేట్ చేసింది.
- రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు.
- రూ.5 వేల కోట్లుగా ఉన్న మైక్రో ఇరిగేషన్ ఫండ్‌ను 10 వేల కోట్లకు పెంచారు.
- ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ యోజన (పీఎం ఆశా)కు1,500 కోట్లు.
- 10 వేల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఈపీవో) ఏర్పాటుకు 700 కోట్లు.
- అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కు 900 కోట్లు.
- ప్రధాన్ మంత్రి కృషి సించయ్ యోజనకు రూ.4 వేల కోట్లు.
- మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బండరీ, డెయిరీలకు రూ.4,820.82 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి 1,308.66 కోట్లు
- అస్సాం, వెస్ట్ బెంగాల్‌లో తేయాకు కార్మికుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు.