కాలానికతీతమైన వెన్నెల

కాలానికతీతమైన వెన్నెల

చీకట్లను పారదోలే వెన్నెలకు వయసు లేదు. అప్పుడప్పుడు ఆ వెలుగుల తీవ్రత తగ్గినట్లు, పూర్తిగా మాయమైనట్లు అనిపించినా అది తాత్కాలికమే. అందుకేనేమో రచయిత జిల్లేళ్ల బాలాజీ తన కథల సంకలనానికి ‘నిరుడు కురిసిన వెన్నెల’ అని పేరు పెట్టినట్లు అనిపిస్తుంది. దాదాపు 30 ఏండ్ల కిందట, రచయితగా తన ప్రస్థానం మొదలైన దశలో ఆయన రాసిన పదిహేను కథలు ఇందులో ఉన్నాయి. అవన్నీ వివిధ వార, పక్ష, మాసపత్రికల్లో ప్రచురితమైనవే. ఆ కథలే కాదు, వాటిలోని కథావస్తువులు కూడా చాలావరకు పాతవే. అవన్నీ అప్పటి సమాజం గురించి చెప్తాయి.

ఆడవాళ్ల పాలిట వరకట్నం, వైధవ్యం, మగోళ్ల ఆకలిచూపులు, అవకాశవాదం అప్పట్లో ఎలా ఉండేవో కళ్లముందు ఉంచుతాయి. నిజానికి ఇవి ఇప్పటికీ సమాజంలో ఉన్నాయి. కాకపోతే వాటి తీవ్రతలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయంతే. కథలన్నీ చదివించేలా ఉన్నాయి. వాటిని నడిపించిన తీరు బాగుంది. అక్కడక్కడ అక్షరదోషాలు అడ్డుతగులుతాయి. – సాయి ప్రేమ్​