
ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘన సాధించిన విషయం తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై ఓల్టేజ్ మ్యాచులో గుజరాత్‌ను 20 పరుగుల తేడాతో ఓడించి ముంబై పల్టాన్స్ క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎంఐ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 81, జానీ బెయిర్‌స్టో 47 పరుగులతో రాణించారు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన గిల్ సేన 208 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
సాయి సుదర్శన్ (80), వాషింగ్టన్ సుందర్ (48) పోరాడినా చివర్లో ముంబై బౌలర్లు రాణించడంతో జీటీకి ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే.. ఈ హై ఓల్టేజ్ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోన్న సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజ్ ఓనర్ నీతా అంబానీ స్టేడియంలో కూర్చొనే మతపరమైన ప్రార్థనాలు చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో ఆమె ప్రార్ధనలు చేశారు. తన కుమారుడి పక్కనే కూర్చొని మ్యాచ్ మధ్యలో నీతా అంబానీ ప్రార్ధనలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగా వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
‘నీతా అంబానీకి ఏం దైవ భక్తి అండీ.. స్టేడియంలోనే పూజలు, స్త్రోత్రాలు చదివేస్తున్నారు’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. గుజరాత్ బ్యాటర్స్ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతుండటంతో ‘‘దేవుడా వాళ్లని త్వరగా ఔట్ చేసి ముంబైని గెలిపించు’’ అంటూ ఆమె దేవున్ని వేడుకుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఇంకొందరు ‘నీతా అంబానీ ప్రార్థనలు ఫలించి ముంబై గెలిచింది’ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. రోజువారీ అలవాటులో భాగంగా ఆమె ప్రార్థనలు చేశారని కొందరు నీతా అంబానీకి మద్దతుగా నిలుస్తున్నారు.
Unseen Video of Neeta Ambani Pyaying the Match#MIvsGT pic.twitter.com/1grkUhnTEb
— 𓆩◕Ꮢ𝗞◕𓆪 (@jija009_) May 30, 2025