రాజకీయ ప్రత్యర్థుల్ని దేశ ద్రోహులనొద్దు: నితిన్ గడ్కరీ

రాజకీయ ప్రత్యర్థుల్ని దేశ ద్రోహులనొద్దు: నితిన్ గడ్కరీ

ప్రతి పక్షాలను పాకిస్థాన్ తో పోల్చుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఉధృతంగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతున్నది.సిద్ధాంతాల్ని వ్యతిరేకించినంత మాత్రాన రాజకీయ ప్రత్యర్థులపై దేశద్రోహులనే ముద్ర వేయడం సరికాదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నా రు. ప్రత్యర్థులపై విద్రోహ ముద్రలేయడం బీజేపీ విధానం కాదంటూ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే గడ్కరీ కూడా గొంతు కలపడం చర్చనీయాంశమైంది. ఆర్ఎస్​ఎస్​ హెడ్​ క్వార్టర్ నాగ్ పూర్నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న గడ్కరీ, గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడుతూ, పెద్దాయన అద్వానీ మాటలు సమర్థనీయమన్నారు.గత ఎన్నికల్లో మోడీ ప్రభంజనం కారణంగా నాగ్పూర్ నుంచి ఈజీగా గెలిచినా, ఈ సారి అలాంటి పరిస్థితి లేదని, కేవలం అభివృద్ధి పనుల్ని చూసే జనం ఓట్లేశారని నితిన్ గడ్కరీ చెప్పారు.

ఇటీవల సంచలనం రేపిన అద్వానీ వ్యాఖ్యలపై అభిప్రాయాన్ని కోరగా,‘‘భిన్నాభిప్రాయాలను మనం గౌరవించి తీరాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అసలైనస్ఫూర్తి అదే. మనవైపు లేనంత మాత్రాన అవతలివాళ్లను యాంటీ నేషనల్స్ అనడం సరైందికాదు. ప్రతిఒక్కరూ తమకు నచ్చిన అభిప్రాయం కలిగుండొచ్చు.దాన్ని మనం తప్పుపట్టలేం . ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు చాలా సహజం” అని గడ్కరీ బదులిచ్చారు. బీజేపీ అంటే కమ్యూనల్ పార్టీ అన్న అభిప్రాయం ఇంకా కొందరిలో ఉందని, నిజానికి తమది నేషనల్ పార్టీ అని ఆయన వివరించారు. ప్రధాని పదవిపై ఆశలేదని గడ్కరీ మరోసారి స్పష్టం చేశారు.