9 లక్షలకు పైగా వాహనాలను స్క్రాప్‭కు పంపనున్నాం: నితిన్ గడ్కరీ

9 లక్షలకు పైగా వాహనాలను స్క్రాప్‭కు పంపనున్నాం: నితిన్ గడ్కరీ

15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 9 లక్షలకు పైగా వాహనాలను.. ఏప్రిల్ 1 నుంచి రద్దు చేయనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. FICCI ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొన్నారు. 15 సంవత్సరాలకు పైగా వినియోగంలో ఉన్న ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేసేందుకు ఆమోదించామని ఆయన చెప్పారు. దీని వల్ల కాలుష్యాన్ని కలిగించే బస్సులు, కార్లు వినియోగంలో ఉండవన్నారు. వాటి స్థానంలో కొత్త వాహనాలు వస్తాయన్నారు. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గుతుందని ఆయన చెప్పారు. 

ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ నమోదై 15 ఏళ్లు పూర్తయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను తప్పించనున్నారు. వాటిని చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.