మే 11న శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రేతో బీహార్‌ సీఎం నితీశ్‌, తేజస్వీ భేటీ

మే 11న శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రేతో బీహార్‌ సీఎం నితీశ్‌, తేజస్వీ భేటీ

ముంబై : వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్న ఆయన బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా గురువారం (మే 11వ తేదీన) ముంబైలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సమావేశం కానున్నారు. బీహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నారు నితీశ్‌ కుమార్‌.

మొదట ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అవుతారని, సాయంత్రం శరద్‌ పవార్‌ను కలుస్తారని జేడీయూ ఎమ్మెల్సీ కపిల్‌ పాటిల్‌ చెప్పారు. భవిష్యత్‌ రాజకీయాలపై చర్చించనున్నారని తెలిపారు. నితీశ్, తేజస్వీ గత నెల 24న పశ్చిమబెంగల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ ముఖ్యనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు.