పాట్నా: ఇన్నేండ్లు నిజాయితీగా ప్రజల కోసమే కష్టపడ్డానని, తన కుటుంబం కోసమంటూ ఏమీ చేయలేదని బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి శనివారం 3 నిమిషాల వీడియోను నితీశ్ కుమార్ విడుదల చేశారు. ‘బిహార్ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములారా.. 2005 నుంచి మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించారు.
ఆనాటి నుంచి ప్రతిరోజు నీతి నిజాయితీతో కష్టపడి పనిచేశాను. రాష్ట్రంలో విద్య, వైద్యం, రోడ్లు, కరెంట్, తాగునీరు, సాగునీరు తదితర సౌలతులు కల్పించాం. యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించాం. గత ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఏమీ చేయలేదు. కానీ మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు స్వయంశక్తితో ఎదిగేలా చేశాం.
మేం మొదటి నుంచి అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశాం. కులమత బేధం లేకుండా అందరినీ సమానంగా చూశాం” అని పేర్కొన్నారు. మరోసారి ఎన్డీయేకు అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
