బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

బీహార్లో కొత్త సర్కారు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. 7 పార్టీలతో పాటు ఒక ఇండిపెండెంట్తో కలిసి మహా కూటమి ఏర్పాటు చేసిన ఆయన గవర్నర్కు మద్దతు లేఖ అందజేశారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఓకే చెప్పడంతో రేపు (బుధవారం) సాయంత్రం 2 గంటలకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్తో పాటు డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేసే అవకాశముంది. 

బీజేపీ ఆటలు సాగనివ్వం
పొత్తు పెట్టుకున్న పార్టీలను బీజేపీ నాశనం చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఇదే జరిగిందన్న విషయానికి చరిత్ర సాక్ష్యమని అన్నారు. పంజాబ్, మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను నామరూపాల్లేకుండా చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిన విషయాన్ని తేజస్వీ గుర్తు చేశారు. బెదిరించడం లేకపోతే డబ్బుతో కొనేయడం మాత్రమే బీజేపీకి తెలుసన్న ఆయన.. బీహార్ లో వారి ఆటలు సాగనివ్వమని అన్నారు. 
 

వేగంగా మారుతున్న పరిణామాలు
అంతకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ పాట్నాలోని రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, రబ్రీ దేవితో భేటీ అయ్యారు.  2017లో జరిగిన పరిణామాలను మరిచిపోయి కొత్త అధ్యాయం మొదలుపెడదామని నితీశ్ తేజస్వీని కోరినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి రావాలని ప్రతిపాదించగా.. జేడీయూ చీఫ్ అభ్యర్థనకు తేజస్వీ ఓకే చెప్పడంతో వారిరువురూ కలిసి గవర్నర్ ఫగు చౌహాన్ ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లారు.

2015లో జేడీయూ, ఆర్జేడీ పొత్తు 
ఆర్జేడీతో కలిసి నితీశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాదు. 2015 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అప్పట్లో తేజస్వీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టగా లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రిగా పనిచేశారు. అయితే 2017లో  ఆర్జేడీ, కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కూటమి విజయ సాధించింది. నితీశ్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆయనకే సీఎం పదవి అప్పజెప్పారు. 

మహా కూటమి ప్రభుత్వం
సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ సారథిగా ఉన్నప్పటికీ కొంతకాలంగా ఆయన మాట చెల్లుబాటు కావడంలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తరహా పరిణామాలు తలెత్తే ప్రమాదముందని అనుమానిస్తున్న నితీశ్.. బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమయయ్యారు. ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలుసైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీతో మళ్లీ జట్టు కట్టారు. మొత్తం ఏడు పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మహాకూటమి ఏర్పాటు చేసిన నితీశ్.. తాజాగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.