బీజేపీ వైపు నితీశ్ కుమార్ చూపు

బీజేపీ వైపు నితీశ్ కుమార్ చూపు
  • ఆర్జేడీతో విభేదాలతో ఎన్​డీఏలో చేరనున్నట్లు వార్తలు

పాట్నా :  బీహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి ఎన్​డీఏలో చేరనున్నట్లు తెలుస్తున్నది. రెండు మూడ్రోజుల్లో ఆయన దీనిపై నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జేడీయూ ఎమ్మెల్యేలతో ఆయన చర్చించినట్లు సమాచారం. బీజేపీ మద్దతుతో జనవరి 28న నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హెచ్ఎం పార్టీ చీఫ్, మాజీ సీఎం జతిన్​రామ్ మాంఝీ వీరికి మద్దుతు ఇవ్వనున్నారని తెలుస్తున్నది. 2022లో ఎన్​డీఏ నుంచి బయటకొచ్చిన నితీశ్ మహాఘట్‌‌బంధన్‌‌’తో చేతులు కలిపారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్​ ఇతర ప్రతిపక్షాలతో కలిసి ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న ఆర్జేడీతో విభేదాలు రావడంతో మళ్లీ ఎన్​డీఏలో చేరనున్నట్లు తెలుస్తున్నది.

అలాగే, ఇండియా కూటమిలో తన స్థాయికి తగిన పదవి దక్కడం లేదని నితీశ్ అసంతృప్తిగా ఉన్నారు. లోక్‌‌సభ ఎన్నికలతో పాటే బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న ఆయన చేసిన ప్రపోజల్​ను ఆర్జేడీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్​డీఏ వైపు మొగ్గినట్లు జేడీయూ నేతలు చెప్తున్నారు. నితీశ్ ఇలా అలయన్స్​లు మార్చడం ఇది ఐదోసారి.