
పాట్నా: బీహార్ సీఎంను మార్చే అవకాశం లేదని బీజేపీ స్పష్టం చేసింది. నితీష్ కుమార్ బీహార్ కు మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ బుధవారం నాడు స్పష్టం చేశారు.బీహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో 74 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 43 స్థానాలకే పరిమితమైంది.బీహార్ లో జేడీ(యూ), బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)లు కలిసి పోటీ చేశాయి.దీంతో నితీశ్ సీఎం పదవీ గండం ఏర్పడిందని, రాష్ట్రంలో మొదటిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో సీఎం పదవిపై సుశీల్ కుమార్ మోదీ స్పష్టతనిచ్చారు.
తమ పార్టీల పొత్తు మేరకు నితీష్ కుమార్ బీహార్ సీఎం అవుతారని సుశీల్ కుమార్ మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు.ఎన్నికల్లో కొందరు ఎక్కువ గెలుస్తారు, కొందరు తక్కువ గెలుస్తారన్నారు. అయితే మేం సమాన భాగస్వామ్యులు అని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందే రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని మార్చడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.