నిజాం విద్యార్థులను చర్చలకు ఆహ్వానించిన వైస్ ప్రిన్సిపాల్

నిజాం విద్యార్థులను చర్చలకు ఆహ్వానించిన వైస్ ప్రిన్సిపాల్

నిజాం కాలేజీ విద్యార్థులను.. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంజిని చర్చలకు ఆహ్వానించారు. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ నవీన్ మిట్టల్‭తో.. తమ సమస్యలు చెప్పేందుకు 10 మంది విద్యార్థులు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే.. కళాశాలకు వచ్చి చర్చించాలని విద్యార్థులు తేల్చిచెప్పారు. దీంతో వైస్ ప్రిన్సిపల్, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తాను ఎక్కడికి కదిలేది లేదంటూ.. కళాశాల ప్రాంగణంలోనే నిరసన కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. 

డిగ్రీ విద్యార్థులకు హాస్టల్‌ బిల్డింగ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని విద్యా్ర్థినులు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తమకు హాస్టల్ కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. కొత్త హాస్టల్ బిల్డింగ్ ను పీజీ విద్యార్థులకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఓయూ వీసీ రవీందర్ తో చర్చలు జరిపారు. డిగ్రీ స్టూడెంట్లకు హాస్టల్ వసతి ఇవ్వొచ్చా.. లేదా, ఒక వేళ ఇచ్చే అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయం ఏంటీ అనే అంశాలపై చర్చించారు. స్టూడెంట్ల డిమాండ్లు, ఇతర సమస్యలపై వారితో మాట్లాడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లెక్కచేయకుండా విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల నిరసనకు సాంస్కృతిక విభాగ ప్రొఫెసర్ నర్సయ్య మద్దతు తెలిపారు. మంత్రి కేటిఆర్ స్పందించిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు హాస్టల్ కేటాయించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.